వెలిగొండకు వెయ్యికోట్లివ్వండి | give to veligonda project thousend cores | Sakshi
Sakshi News home page

వెలిగొండకు వెయ్యికోట్లివ్వండి

Published Tue, Mar 14 2017 6:04 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

give to veligonda project thousend cores

► రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
► జిల్లాలోనే మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
► పొగాకుకు కిలో రూ.165 ధర ఇవ్వాలి
► భూమా మరణం మమ్మల్ని బాధించింది
► ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లాలో వందలాది మంది మరణాలకు కారణమైన ఫ్లోరైడ్‌ నుంచి గట్టెక్కాలంటే వెలిగొండ నీరే శరణ్యమని, జిల్లా వాసులకు తాగు, సాగు నీటికి ఈ ప్రాజెక్టు ఏకైక మార్గమని ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వెయ్యి కోట్ల రూపాయల నిధులిచ్చి వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు
 
. సోమవారం ఒంగోలులోని స్వగృహంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కారు సకాలంలో నిధులు కేటాయించకపోవడం వలనే ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యాయని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన బాబు, మూడేళ్లు దాటుతున్నా పనులు పూర్తి చేయలేదన్నారు. మొక్కుబడి నిధుల కేటాయింపు వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదని మండిపడ్డారు. తక్షణం వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వెలిగొండ నీరు తప్ప జిల్లా వాసులకు మరో ఆధారం లేదన్నారు. ప్రస్తుతం గుక్కెడు తాగునీరు కూడా అందే పరిస్థితి లేదని చెప్పారు.
 
తక్షణం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుకు నీళ్లు వస్తే ఫ్లోరైడ్‌ సమస్య తీరే అవకాశం ఉందన్నారు. గిట్టుబాటు ధరల్లేక జిల్లా రైతాంగం తీవ్ర నష్టాలపాలైందని, కందులు కొనే వారే లేరన్నారు. గతేడాది కందులు సైతం నిల్వ ఉన్నాయని చెప్పారు. కందికి గిట్టుబాటు ధర కల్పించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. మూడేళ్ల వరుస కరువుతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. ఇక పొగాకు రైతులకు సైతం గిట్టుబాటు ధర లేదన్నారు. తీవ్రంగా నష్టపోయి దాదాపు 48 మంది పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఈ ఆత్మహత్యలను నిరోధించాలంటే గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. కిలో రూ.165కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పొగాకు బోర్డులు రైతులపై ఆంక్షలు పెట్టడం మాని వ్యాపారులను, దళారులను అదుపులో పెట్టాలని ఎంపీ సూచించారు. గిట్టుబాటు ధర రాక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతేడాది క్వింటాలు మిర్చి రూ.13 వేల వరకు ఉంటే ఈ ఏడాది రూ.4,500 మాత్రమే ధర ఉందని రైతులకు కూలీల ఖర్చులు కూడా రావడం లేదని ఎంపీ పేర్కొన్నారు. క్వింటా మిర్చి రూ.10 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులు గుంటూరు మిర్చి యార్డుకు పంట తరలించాలంటే ట్రాన్స్‌పోర్టు అదనపు భారంగా మారిందన్నారు. ప్రకాశం జిల్లాలోనే మిర్చి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. 
 
భూమా మరణం బాధించింది
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తమనెంతో బాధించిందని ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూమాను వైఎస్‌ కుటుంబంలో సభ్యులుగానే భావిస్తామన్నారు. ఆయన మృతితో తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినంతగా కలత చెందామని చెప్పారు. నాగి రెడ్డి పిల్లలకు దేవుడు మనోధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నామన్నారు. భూమా కుటుంబానికి రాజకీయాలకతీతంగా వైఎస్సార్‌ కుటుంబం అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని ఎంపీ చెప్పారు. శోభానాగిరెడ్డి చనిపోవడమే ఆ కుటుంబానికి పెద్ద లోటుగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో భూమా చనిపోవడం మరింత బాధాకరమన్నారు.   విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ సీనియర్‌ నేత వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement