Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Rescue Operation In Slbc Tunnel 16th Day Continues1
SLBC: ఒక మృతదేహం వెలికితీత

నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు. మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసుకొచ్చింది. అతన్ని టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాన్ని నాగర్‌ కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్‌ ఎండ్‌ పాయింట్‌లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్‌ హోల్‌ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.జీపీఆర్‌, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్.కాగా, గత నెల 22వ తేదీన శైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్‌ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది.

Tollywood Comedian Racha Ravi emotional post on his Marriage day2
'ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను'.. టాలీవుడ్ కమెడియన్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో రచ్చ రవి అందరికీ సుపరిచితమే. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తనదైన కామెడీ, పంచ్‌ డైలాగ్స్‌తో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే బాపు సినిమాలో రచ్చరవి నటించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించారు.తాజాగా రచ్చ రవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన తన భార్య స్వాతిని ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఇది చూసిన రచ్చ రవి అభిమానులు తమ అభిమాన నటుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.రచ్చ రవి తన ఇన్‌స్టాలో రాస్తూ..' నిన్ను పరిచయం చేసిన నీ... నా... తల్లిదండ్రుల రుణం తీరదు. నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. కోరికలు.. ఇష్టాలు.. ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు..నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ... కాంప్రమైజ్ అవుతూ లైఫ్‌లో నన్ను సక్సెస్ చేయిస్తూ.... ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని... అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని.. నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని.... నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని...నా సహచరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. ఐ లవ్ యు స్వాతి..' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi)

Oppositions Poll Offer For Nitish Kumar Tejashwi Yadav Responds3
సీఎం నితీష్‌కు మీరు ఏదో ఆఫర్ చేశారంట కదా?

పాట్నా: ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో జేడీయూ‍ ఆర్జేడీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో ఉంది. ‘నేను గొప్ప అంటే నేను గొప్పు’ అనే రీతిలో వీరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. అటు అసెంబ్లీ మొదలుకొని ఇటు మీడియా ముందు కూడా వీరి ఎక్కడా తగ్గడం లేదు.ఈ రోజు(ఆదివారం) జరిగిన ప్రెస్ మీట్ లో సైతం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై తనదైన శైలిలో రెచ్చిపోయారు. ‘ మీరు నితీష్ ను మీ పాలిటికల్ క్యాంప్ లోకి తీసుకునేందుకు ఏదో ఆఫర్ చేశారంట కదా’ అంటూ తేజస్వీ యాదవ్ కు ఒక ప్రశ్న ఎదురైంది. దానికి అంతే స్ట్రాంగ్ బదులిచ్చిన తేజస్వీ యాదవ్.. ‘ అదంతా నాన్సెస్. అయినా మీకు ఇటువంటి ఐడియాలు ఎవరిస్తారు. మేముందుకు ఆయన్ను ఆహ్వానిస్తాం. ఆఫర్, గీఫర్ ఏం లేదు. అటువంటి నాన్సెస్ గురించి మాట్లాడకండి. మీ పార్టీ నుంచి ఎవరికైనా ఆఫర్ చేస్తే.. అది నేను కానీ, మా తండ్రి(లాలూ ప్రసాద్ యాదవ్) లు మాత్రమే చేస్తాం. మేం ఎవరికీ ఎటువంటి ఆఫర్ చేయలేదు’ అని బదులిచ్చారు తేజస్వీ యాదవ్.2015 ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లు నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీశ్‌ సారథ్యంలో జేడీ(యూ) 71 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే మహాఘట్‌బంధన్‌ కూటమిలో భాగంగా.. ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ త్యాగం చేసింది. 2022లో బీజేపీకి కటీఫ్‌ చెప్పి మళ్లీ మహాఘట్‌బంధన్‌లో చేరి.. సీఎం పదవిని చేపట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్‌ ఉన్నారు. అయితే ఈ బంధం ఏడాదిపాటే కొనసాగింది. 2024లో తిరిగి బీజేపీతో నితీశ్‌ జట్టు కట్టారు.రెండుసార్లు సీఎంను చేశా.. అది మరిచిపోకండిమీ నాన్నను అడుగు.. నేనేం చేశానో?

Small comparisons make difference between Shashi Tharoor and Rahul understandable4
సజాతి ధ్రువాల వికర్షణ

శశి థరూర్‌కీ, కాంగ్రెస్‌ నాయకత్వానికీ మధ్య తలెత్తినట్లుగా కనిపిస్తున్న విభేదాలను ఆసక్తికరంగా మారుస్తున్నది ఏమిటంటే,ఇరు వర్గాల గురించి ఆ విభేదాలు బయటికి ఏం వెల్లడిస్తున్నాయన్నదే. విభేదాలున్నా యన్న సంగతిని వారు ఒప్పుకొని, అంగీకరించకున్నా... ఒకటైతే వాస్తవం. వారు ఒకరి కొకరు పూర్తిగా భిన్నమైనవారు. బహుశా సమస్యకు మూలం, ప్రధానంగా అదే అయి వుండాలి. శశి థరూర్‌ ఫక్తు రాజకీయ నాయకుడు కారు. ముఠాలను, రహస్య మంతనాలను ఆయన నడపరు. బదులుగా, ఆయన తన సొంత ప్రతిభ, నైపుణ్యాల మీద ఆధారపడినవారు. దీనర్థం – ఆయనకు దాపరికాలేం ఉండవని. రాజకీయంగా పైకి రావాలన్న ఆకాంక్ష, గుర్తింపు కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని. అంతేకాదు, తన వైపునకు దృష్టిని మళ్లించుకోవాలని కూడా ఆయన కోరుకుంటారని అర్థమౌతోంది. ముందుకు సాగేందుకు ఆయన విధానం అది. అందులో విజయం సాధించారు కూడా. ట్విట్టర్‌లో ఆయన్ని అనుస రించే అసంఖ్యాక అభిమానులు, ఆయనకు గల ‘గుర్తింపు యోగ్యత’ ... ఇందుకు సాక్ష్యం. కాంగ్రెస్‌ నాయకత్వం, కనీసం ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారా వర్ధిల్లుతూనే వచ్చింది. వారంతా గాంధీల అనుచరులు. వారి నాయకులు గాంధీలు. వారు తమ రాజకీయ జీవితాన్నంతా గాంధీల సేవకే అంకితం చేసినవారు. రాహుల్‌ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్పకూడదనీ నేర్చుకున్నవారు. ఇక ఇప్పుడైతే ప్రియాంకా గాంధీకి పల్లకి మోయటానికి తయారవు తున్నవారు. అంతేనా, ఈ తరహా కుటుంబ ఆరాధనను నియమ బద్ధం చేయటానికి... గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్‌ పార్టీ మనుగడ సాగించలేదని తమను తాము నమ్మించుకుంటున్నవారు ఈ అనుచరులు. చిన్నపాటి పోలికలు శశి, రాహుల్‌ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేయిస్తాయి. శశి తన ప్రతిభ, తెలివితేటలతో కష్టపడి పైకొచ్చినవారు. రాహుల్‌ బలం ఆయన ఇంటిపేరు. రాహుల్‌ స్వయంగా సాధించిన రాజకీయ విజయాలు పరిమితమైనవి. లేదా, ఏమంతగా గుర్తింపులో లేనివి. తగని సమయాలలో విహార యాత్రలకు వెళ్లిపోవటం ఆయన అభిరుచి. శశి బలం... దీర్ఘమైన ఆయన ఆంగ్ల పదాడంబరత, ఆహ్లాద కరమైన ఆయన నడవడిక. రాహుల్‌ స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తిగా కనిపిస్తారు. రాహుల్‌కు తనేం చెప్పాలనుకుంటున్నారో దానిని వ్యక్తపరిచే విషయంలో సమస్యలు ఉన్నాయని చాలామంది నమ్ము తారు. శశి రచయిత. ఇరవైకి పైగా పుస్తకాలు రాశారు. ఆకాంక్షలు గల యువతను ఆయన ఆకర్షిస్తారు. రాహుల్‌ ఎప్పుడూ కూడా పేదలను, ఆర్థికంగా లేదా సామాజికంగా అణచివేతకు గురవుతున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతుంటారు. మొత్తానికి, వీళ్లిద్దరూ భిన్న ప్రపంచాలలో ప్రకాశిస్తున్నవారు. మాజీ దౌత్యవేత్తగా శశి తీరు వివేకవంతంగా, వినయపూర్వకంగా, తన ప్రత్యర్థులు సాధించిన విజయాలను సైతం అంగీకరించే విధంగా ఉంటుంది. అందుకే మోదీ అమెరికా పర్యటనను, లేదా కేరళలో సీపీఎం స్టార్టప్‌లను అభివృద్ధి పరచటాన్ని ఆయన ప్రశంసించకుండా ఉండలేకపోయారు. రాహుల్‌ శైలి ఇందుకు విరుద్ధంగా కఠినంగా, గాయపరిచేలా ఉంటుంది. మాటల బాక్సర్‌ అతడు. కమిలిపోయేలా గట్టి దెబ్బ కొడతారు. కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని, సర్వదా ఆమోదంపొందిన ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్‌ రాజకీయ జీవితం. అది వెలుగులను విరజిమ్మేదేమీ కాదు. ఆయన కొంతకాలం విదేశాంగ, మానవ వనరుల అభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. 2014 తర్వాత రెండు పార్లమెంటరీ సెలక్ట్‌ కమిటీలకు చైర్మన్‌గా ఉన్నారు. అంతకుమించి, కాంగ్రెస్‌లో అగ్రశ్రేణి నాయ కుడిగా ఎప్పుడూ లేరు. ఆయన తన గతం వల్ల లేదా తన సహాయక రాజకీయేతర క్రీయాశీలతల వల్ల మాత్రమే ప్రసిద్ధులు. ఆయన్ని తన భవిష్యత్‌ నేతగా కాంగ్రెస్‌ పార్టీ ఒప్పుకోలేకపోతోంది. ఇవన్నీ కూడా నాలో మూడు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అవి శశి థరూర్‌కు, ఆయన పార్టీ అయిన కాంగ్రెస్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాలకు సంబంధించినవని నేను నమ్ముతున్నాను. మొదటిది, గొప్ప గౌరవ మర్యాదలను పొందుతూ, రాహుల్‌కు ప్రత్యర్థులు కావచ్చునని పరిగణన పొందుతున్న ప్రతిభావంతులైన వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో కాంగ్రెస్‌ పార్టీకి తెలియటం లేదన్న విషయాన్ని ఈ విభేదాలు సూచిస్తున్నాయా?బయటి ప్రపంచానికి రాహుల్, శశి ఎలా కనిపిస్తారో ఒక్క క్షణం ఆలోచించండి. రాహుల్‌ను వారసత్వపు అర్హత గల రాజపుత్రుడిగా చూస్తారు. శశిని ప్రతిభకు, పనితీరుకు ప్రతీకగా చూస్తారు. కాంగ్రెస్‌ తన అధ్యక్ష వంశానికి విధేయతతో... ప్రతిభకు, పని తీరుకు మిగిల్చి ఉంచిన ఆ కాస్త చోటును కూడా పరిమితం చేసేసిందా?రెండవది... పార్లమెంటు లోపల గానీ, పార్లమెంటు బయట గానీ, పార్టీలో శశి థరూర్‌ పోషించవలసిన పాత్ర చాలా స్వల్ప మైనదిగా మాత్రమే ఉంది. ఆయన నేర్పును, నైపుణ్యాలను ఉపయో గించుకునే విషయంలో – అలాంటి అలవాటు లేకపోవటం కారణంగా – కాంగ్రెస్‌ జాగ్రత్త పడుతూ రావటమే కారణమా? ఒకప్పుడు విశాల గుడారమైన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు నెరవేర్చదగిన ఆకాంక్షలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోయిందా?మూడవది, తానెప్పటికీ గెలవలేనని తెలుసు; తన ఆశయం, కనీసం తన ఉద్దేశం ఏమిటని ఆలోచించేవారిని అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని తెలిసినా శశి థరూర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి పోటీ పడి తప్పు చేశారా? ఆ ఎన్నికలను ప్రజాస్వా మ్యబద్ధం చేయటానికే ఆయన పోటీలో నిలబడ్డారని నాకు తెలుసు. సాధారణంగానైతే ఆ చొరవను మెచ్చుకోవాలి. కానీ పోటీ లేకుండా అభ్యర్థిని గెలవనిచ్చే కాంగ్రెస్‌ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇదంతా జరిగినట్లయిందా?నాల్గవ ప్రశ్న కూడా ఉంది. సాధారణమైన ప్రశ్న. శశి థరూర్‌ కనుక కాంగ్రెస్‌ నుండి విడిపోతే అది ఆ పార్టీకి ఏపాటి ఎదురు దెబ్బ అవుతుంది? ఆయన విషయానికొస్తే కేరళలో ఆయన ఆశలు విఫలం కావచ్చు. ఒకటి మాత్రం చెప్పగలను. ఆయన కాంగ్రెస్‌ను వీడతారో లేదో గానీ, బీజేపీలో చేరతారంటే మాత్రం నేను నమ్మలేను.» కాంగ్రెస్‌ పార్టీ ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారానే వర్ధిల్లుతూ వచ్చింది. వారంతా రాహుల్‌ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్ప కూడదనీ నేర్చుకున్నవారు.» రాహుల్‌ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్‌ రాజకీయ జీవితం.- వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌- కరణ్‌ థాపర్‌

Ilayaraja composed 8500 songs for 1500 films5
రాజా... రాజాధిరాజా...

‘టిక్‌... టిక్‌... టిక్‌...’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కె.భారతీరాజా తన మిత్రుడు ఇళయరాజాకు పాట సందర్భాన్ని వివరిస్తూ ‘పాట మధ్యలో ఒకచోట భయంకరమైన మ్యూజిక్‌ కావాలి. అక్కడ ప్రేక్షకులు ఉలిక్కిపడే దృశ్యం చూపిస్తాను’ అన్నాడట. ఇళయరాజా ‘సరే’ అని పాట రికార్డు చేశాడు. భారతీరాజా ఆ పాట విని మొదట తనే ఉలిక్కిపడ్డాడు. ఏమంటే భయంకరమైన మ్యూజిక్‌ కావాలని అతడు కోరిన చోట ఇళయరాజా ఏం చేశాడో తెలుసా? కొన్ని సెకన్ల నిశ్శబ్దం ఉంచాడు. ‘నిశ్శబ్దానికి మించిన భయమైన ధ్వని ఏముంది?’. ఆ పాట హిట్‌ అయ్యింది. శబ్దం, నిశ్శబ్దం తెలిసిన ఈ మహా సంగీతకారుడు గత 50 ఏళ్లుగా కోట్లమందికి తోడుగా ఉన్నాడు. అభిమానులతో సహజీవనం చేస్తున్నాడు. ఆరాధకులతో సహయానం సాగిస్తున్నాడు. మనసుకు వైద్యుడు. కలత వేళ ఏకాంత తీరాలకు మోసే వెదురు తెప్ప.‘ప్రేమ’ సినిమా కుర్రకారు ఓపెనింగ్స్‌తో మొదలైంది. హీరో గిటారిస్ట్‌. క్లయిమాక్స్‌ జాతీయస్థాయిలో పాటల పోటీ. హీరో ఎలాంటి పాటతో అదరగొట్టి చిందులు వేస్తాడోనని అందరూ ఎదురు చూస్తే ‘ప్రియతమా... నా హృదయమా’... అని ఎంతో నెమ్మదైన మెలడీ వస్తుంది. ఇళయరాజా అలా ఎందుకు చేశాడు? పాట మరోసారి వినండి. పాటకు ముందు మెరుపు వేగంతో గిటార్‌ మోతతో స్టేజ్‌ ఊగిపోయేలా ప్రిలూడ్‌ వస్తుంది. హఠాత్తుగా ఆగి స్లోగా పాట మొదలవుతుంది. హీరో పాడాలనుకున్నది ప్రిలూడ్‌కు అనువైన పాట. పాడింది ఈ పాట. కారణం? హీరోయిన్ చావు బతుకుల్లో ఉంది. దర్శకుడి కంటే ఇళయరాజాకే కథ బాగా అర్థం అవుతుంది. అందుకే అతడి పాట నిలబడుతుంది.తెల్లవారే లేచి, కాస్త∙టీ కొట్టి, హైదరాబాద్‌ నుంచి చెన్నైకి కారు ప్రయాణం మీద బయలుదేరే కొందరు అమ్మో అంత దూరమా? అనుకోరు. ఇళయరాజా పాటల పెన్ డ్రైవ్‌ తగిలిస్తే చాలు అనుకుంటారు. ఏ శనివారం సాయంత్రమో పార్టీలో డబ్బు తక్కువై సరంజామా తగ్గినా ఊరుకుంటారు... ఇళయరాజా పాట మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాల్సిందే. ప్రేమ విఫలం... ఇళయరాజా. ప్రేమ జయం... ఇళయరాజా. భావనలొకటై సాగిపోయే వేళలో.... పరువమా చిలిపి పరుగు తీయకు....తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా మారి అప్ప టికే మన ఏ.ఎం.రాజా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ‘అన్నాకిళి’ (1976)తో ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు. పెరిగే అభిమానుల రాశి తప్ప అతని పాటల సూచి కుదేలైన దాఖలా లేదు. ఇసైజ్ఞాని. మేస్ట్రో. రాజా సార్‌. ఒకసారి వింటే చర్మానికి అంటుకుపోయే ఒడు కొలాన్ సెంట్‌. 1980లలో హైస్కూల్లోనో కాలేజీలోనో ఉన్నవారెవరైనా ఇతని మొగలి వనాలలో వ్యసనపరులు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది.రావడం రావడమే కొత్త సౌండ్‌ను ప్రవేశ పెట్టిన ఇళయరాజాకు, కర్ణాటక ధోరణిని వెస్ట్రన్ తో ఫ్యూజన్ చేయాలనుకుంటున్న ఇళయరాజాకు తన పాటలు సగటు శ్రోతలకు నచ్చుతాయా లేదా అనే సందేహం తెగ పీడించింది. ఒకరోజు సాయంత్రం వాకింగ్‌కు ఇంటి నుంచి బయలుదేరితే రేడియోలో ‘అన్నాకిళి’ (రామచిలుక)లోని ‘మావయ్య వస్తాడట’ పాట మొదలైందట! అంతే... ఆ ఇంటి ఇల్లాలు గబగబా బయటకు వచ్చి ‘ఓ సుబ్బాయక్కా... మంగమ్మత్తా... మావయ్య వస్తాడట పాట వస్తోందే రేడియో పెట్టండి’ అని అరిచిందట! ఇళయరాజా నడుస్తున్న పొడవైన వీధి. ఇక చూడండి... ప్రతి గడపా వరుసగా రేడియో ఆన్ చేస్తూ అతని పాటను అతనికే వినిపిస్తూ కచేరీ. వారిచ్చిన నమ్మకం నేటికీ!‘సంగీతం రాదు... ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను’ అనే ఇళయరాజా ఇంత పేరు, ఖ్యాతి, సంపద తర్వాత కూడా వయసు రీత్యా విరమించుకొని ఉండొచ్చు. గర్వంతో మొద్దుబారి ఉండొచ్చు. అహంతో బంగారు సింహాసనం చేసుకుని విర్రవీగొచ్చు. కాని అతడు అవేం చేయలేదు. భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్‌ మ్యూజిక్‌లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్‌’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఫిల్‌హార్మోనిక్‌ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చాడు. ప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్‌ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్‌లో సింఫనీ రాసి, లండన్ లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించాడు. మరల రాజాధిరాజుగా నిలిచాడు. వ్యక్తిగత ప్రవర్తనలో కొందరికి అభ్యంతరాలు ఉండుగాక... కాని ఇళయరాజా ఒకసారి హార్మోనియం పెట్టె ముందు కూచున్నాడంటే దేవుడు– అభిమానులకు! చేసిన పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరుకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమిటి చెప్పడం! రాజా తరగని స్ఫూర్తి. కొద్దిగా చేసి ఎంతో అనుకునేవారు, కాసింత వయసుకే డీలా పడిపోయే వారు, నాలుగు ముక్కలు చదివి మేధావులుగా చలామణి అయ్యేవారు, అద్దెలొచ్చే నాలుగు ఫ్లాట్లకు ఓనరై్లనంత మాత్రాన ఇతరులను పురుగుల్లా చూసేవారు... రాజా నుంచి నేర్చుకోవాల్సింది ఉన్నట్టే ఉంది. రాజా చెయ్యి వేస్తే... అది రాంగై పోదు లేరా!

Telangana govt allocates Rs 11000 crore for 55 young india integrated residential schools: Bhatti Vikramarka6
సమీకృత గురుకులాలకు రూ. 11,000 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు (వైఐఐఆర్‌ఎస్‌)...రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు. అన్ని వర్గాల పిల్లలను ఒకే గొడుగు కిందకు తెచ్చి విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో దీనికి అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగా తొలివిడత ఒకే దఫాలో 55 సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఒక్కో సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయిస్తూ.. మొత్తం 55 పాఠశాలలు నిర్మించేందుకు రూ.11 వేల కోట్లు మంజూరు చేసింది.ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకేవిడత ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం ఇదే ప్రథమం. కాగా గురుకులాల నిర్మాణానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కుల, మత వైషమ్యాలు తొలగిపోయేలా.. కుల, మత వైషమ్యాలు తొలగిపోవాలని, అందరికీ సమాన విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సమీకృత గురుకుల పాఠశాలల క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం నాలుగు గురుకుల పాఠశాలలుంటాయి. డిమాండ్‌కు అనుగుణంగా కొన్నిచోట్ల జనరల్‌ గురుకుల పాఠశాలలకు సైతం అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఒక్కో సమీకృత గురుకుల పాఠశాల క్యాంపస్‌ విస్తీర్ణం గరిష్టంగా 25 ఎకరాల్లో ఉంటుంది. ఈ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్‌ విద్యను అందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, మినీ యాంఫీథియేటర్, క్రీడా ప్రాంగణం ఉండేలా డిజైన్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 55 నియోజకవర్గాలివే.. మంచిర్యాల, హుస్నాబాద్, ఆంధోల్, వికారాబాద్, షాద్‌నగర్, కొల్లాపూర్, నల్లగొండ, వరంగల్‌ ఈస్ట్, ములుగు, ఖమ్మం, పాలేరు, అచ్చంపేట్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, భూపాలపల్లి, బోధన్, చాంద్రాయణగుట్ట, చెన్నూరు, చేవెళ్ల, చొప్పదండి, దేవరకద్ర, ధర్మపురి, డోర్నకల్, గద్వాల, స్టేషన్‌ఘన్‌పూర్, జడ్చర్ల, జగిత్యాల, జుక్కల్, కల్వకుర్తి, కోదాడ, కొత్తగూడెం, మక్తల్, మానకొండూరు, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మునుగోడు, నాగార్జునసాగర్, నాగర్‌కర్నూల్, నకిరేకల్, నారాయణఖేడ్, నారాయణపేట, నర్సంపేట, నిజామాబాద్, పరకాల, పెద్దపల్లి, పినపాక, రామగుండం, సత్తుపల్లి, తాండూరు, తుంగతుర్తి, వనపర్తి, వైరా, ఇల్లందుల్లో సమీకృత గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో.. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు కేటాయిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులతో భట్టి సమావేశమయ్యారు. అనంతరం మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.పేద, బడుగు, బలహీన, సామాన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకే సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇవి దేశంలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ఉంటాయన్నారు. ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా సిలబస్‌ను రూపొందిస్తున్నామన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి భట్టి కృతజ్ఞతలు తెలిపారు.మీడియా సమావేశంలో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్‌ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా సమీకృత గురుకులాలకు రూ.11 వేల కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమంటూ.. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు.

India beat New Zealand by 4 wickets in Champions Trophy final7
మనమే చాంపియన్స్‌

భారత జట్టు మరోసారి తమ చాంపియన్‌ ఆటను ప్రదర్శించింది. తొలి మ్యాచ్‌ నుంచి అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు అజేయంగా విజయప్రస్థానాన్ని ముగించింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సమష్టి ఆటతో ఒక్కో ప్రత్యర్థిని పడగొడుతూ వచ్చిన జట్టు తమ స్థాయికి తగ్గ విజయాన్ని అందుకుంది. ఏడాది వ్యవధిలో మరో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టైటిల్‌ను సొంతం చేసుకొని ప్రపంచ క్రికెట్‌పై తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమిని పూర్తిగా మరచిపోయేలా కాకపోయినా... ఈ ఫార్మాట్‌లో మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకొని అభిమానులకు ఆనందాన్ని పంచింది. 2013లాగే ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియా ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో టాస్‌ ఓడినా న్యూజిలాండ్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేయడంతోనే భారత్‌కు గెలుపు దారులు తెరుచుకున్నాయి. మన స్పిన్‌ చతుష్టయాన్ని ఎదుర్కోవడంలో మళ్లీ తడబడిన కివీస్‌ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో రోహిత్‌ శర్మ దూకుడైన ఆరంభం లక్ష్యాన్ని అందుకునేందుకు తగిన పునాది వేసింది. మధ్యలో కొద్దిసేపు కివీస్‌ స్పిన్నర్లూ ప్రభావం చూపడంతో 17 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో సమర్థమైన బ్యాటింగ్‌ లైనప్‌ తడబడకుండా టీమ్‌ను విజయతీరం చేర్చింది. క్రికెట్‌లో ‘మంచి బాలురు’వంటి న్యూజిలాండ్‌ టీమ్‌ మరోసారి ‘పోరాడి ఓడిన’ ముద్రతోనే నిరాశగా నిష్క్రమించింది.దుబాయ్‌: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ–2025ను భారత్‌ సొంతం చేసుకుంది. లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్, ఫైనల్‌ కలిపి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా జట్టు టైటిల్‌ గెలుచుకుంది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్‌ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. గతంలో భారత్‌ 2002, 2013లలో కూడా చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను గెల్చుకుంది. ఫైనల్లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డరైల్‌ మిచెల్‌ (101 బంతుల్లో 63; 3 ఫోర్లు), మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (40 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (83 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా... శ్రేయస్‌ అయ్యర్‌ (62 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. టోర్నీ మొత్తంలో 263 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ ప్లేయర్‌ రచిన్‌ రవీంద్ర ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు గెల్చుకున్నాడు. మిచెల్‌ హాఫ్‌ సెంచరీ... కివీస్‌ ఇన్నింగ్స్‌ను రచిన్‌ రవీంద్ర (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా మొదలు పెట్టాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్‌ స్పిన్నర్‌ వరుణ్‌ను బౌలింగ్‌కు దింపింది. విల్‌ యంగ్‌ (23 బంతుల్లో 15; 2 ఫోర్లు)ను అవుట్‌ చేసి అతను ఓపెనింగ్‌ జోడీని విడదీశాడు. 10 ఓవర్లలో కివీస్‌ స్కోరు 69 పరుగులకు చేరింది. తన తొలి బంతికే రచిన్‌ను బౌల్డ్‌ చేసిన కుల్దీప్, తన రెండో ఓవర్లో విలియమ్సన్‌ (14 బంతుల్లో 11; 1 ఫోర్‌)ను పెవిలియన్‌ పంపించి ప్రత్య ర్థిని దెబ్బ కొట్టాడు.లాథమ్‌ (30 బంతుల్లో 14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో మిచెల్, గ్లెన్‌ ఫిలిప్స్‌ (52 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడటంతో పరుగులు నెమ్మదిగా వచ్చాయి. వరుసగా 81 బంతుల పాటు బౌండరీనే రాలేదు. ఎట్టకేలకు 91 బంతుల్లో మిచెల్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. ఒక వైపు తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయినా... ఆఖర్లో బ్రేస్‌వెల్‌ వేగంగా ఆడటంతో జట్టు స్కోరు 250 పరుగులు దాటింది. చివరి 10 ఓవర్లలో కివీస్‌ 79 పరుగులు చేసింది. నలుగురు భారత స్పిన్నర్లు కలిపి 38 ఓవర్లలో 144 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా... ఇద్దరు పేసర్లు 12 ఓవర్లలో 104 పరుగులిచ్చి ఒకే వికెట్‌ తీయడం మన స్పిన్నర్ల ప్రభావాన్ని చూపించింది. రాణించిన అయ్యర్‌... ఇన్నింగ్స్‌ రెండో బంతికే సిక్స్‌తో మొదలు పెట్టిన రోహిత్‌ తన ఇన్నింగ్స్‌ ఆసాంతం దూకుడుగా ఆడాడు. నాథన్‌ స్మిత్‌ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 31; 1 సిక్స్‌) పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. 10 ఓవర్లలో స్కోరు 64 పరుగులు కాగా, 41 బంతుల్లోనే రోహిత్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఎట్టకేలకు శతక భాగస్వామ్యం తర్వాత గిల్‌ అవుట్‌ కావడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆపై మరో 17 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లు తీసి కివీస్‌ పైచేయి సాధించింది. బ్రేస్‌వెల్‌ తొలి బంతికి కోహ్లి (1) వికెట్ల ముందు దొరికిపోగా, రోహిత్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ఈ దశలో అయ్యర్, అక్షర్‌ పటేల్‌ (40 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌) కలిసి చక్కటి సమన్వయంతో జాగ్రత్తగా ఆడుతూ మళ్లీ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలో వెనక్కి పంపడంతో కివీస్‌ బృందంలో ఆశలు రేగాయి. అయితే కేఎల్‌ రాహుల్‌ (33 బంతుల్లో 34 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) ముందుండి నడిపిస్తూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. 68 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన రాహుల్‌కు హార్దిక్‌ పాండ్యా (18 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) సహకరించాడు. 49వ ఓవర్‌ చివరి బంతిని జడేజా (6 బంతుల్లో 9 నాటౌట్‌; 1 ఫోర్‌) డీప్‌స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఫోర్‌ కొట్టడంతో భారత్‌ విజయాన్ని పూర్తి చేసుకుంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: యంగ్‌ (ఎల్బీ) (బి) వరుణ్‌ 15; రచిన్‌ (బి) కుల్దీప్‌ 37; విలియమ్సన్‌ (సి అండ్‌ బి) కుల్దీప్‌ 11; మిచెల్‌ (సి) రోహిత్‌ (బి) షమీ 63; లాథమ్‌ (ఎల్బీ) (బి) జడేజా 14; ఫిలిప్స్‌ (బి) వరుణ్‌ 34; బ్రేస్‌వెల్‌ (నాటౌట్‌) 53; సాంట్నర్‌ (రనౌట్‌) 8; స్మిత్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–57, 2–69, 3–75, 4–108, 5–165, 6–211, 7–239. బౌలింగ్‌: షమీ 9–0–74–1, పాండ్యా 3–0–30–0, వరుణ్‌ చక్రవర్తి 10–0–45–2, కుల్దీప్‌ యాదవ్‌ 10–0–40–2, అక్షర్‌ పటేల్‌ 8–0–29–0, రవీంద్ర జడేజా 10–0–30–1. భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (స్టంప్డ్‌) లాథమ్‌ (బి) రచిన్‌ 76; శుబ్‌మన్‌ గిల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) సాంట్నర్‌ 31; కోహ్లి (ఎల్బీ) (బి) బ్రేస్‌వెల్‌ 1; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) రచిన్‌ (బి) సాంట్నర్‌ 48; అక్షర్‌ పటేల్‌ (సి) రూర్కే (బి) బ్రేస్‌వెల్‌ 29; కేఎల్‌ రాహుల్‌ (నాటౌట్‌) 34; హార్దిక్‌ పాండ్యా (సి అండ్‌ బి) జేమీసన్‌ 18; జడేజా (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–122, 4–183, 5–203, 6–241. బౌలింగ్‌: జేమీసన్‌ 5–0–24–1, రూర్కే 7–0–56–0, స్మిత్‌ 2–0–22–0, సాంట్నర్‌ 10–0–46–2, రచిన్‌ 10–1–47–1, బ్రేస్‌వెల్‌ 10–1–28–2, ఫిలిప్స్‌ 5–0–31–0. ఫిలిప్స్‌ అసాధారణంఫీల్డింగ్‌ అత్యుత్తమ ప్రమాణాలు చూపిస్తూ తన స్థాయిని పెంచుకున్న ఫిలిప్స్‌ ఆదివారం మరోసారి దానిని ప్రదర్శించాడు. షార్ట్‌ కవర్‌ వైపు గిల్‌ షాట్‌ ఆడగా అసాధారణంగా గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో ఫిలిప్స్‌ అందుకోవడం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ టోర్నీలో అతను ఇప్పటికే కోహ్లి, రిజ్వాన్‌ క్యాచ్‌లను కూడా ఇదే తరహాలో అందుకున్నాడు. క్యాచ్‌లు వదిలేశారు...భారత జట్టు ఫీల్డింగ్‌లో పలు అవకాశాలు చేజార్చింది. కష్టసాధ్యమే అయినా ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసింది. అయితే లైఫ్‌ లభించిన ఆటగాళ్లెవరూ దానిని పెద్దగా సది్వనియోగం చేసుకోలేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. రచిన్‌ రవీంద్ర స్కోరు 29 వద్ద ఉన్నప్పుడు రెండుసార్లు బతికిపోయాడు. షమీ రిటర్న్‌ క్యాచ్‌ వదిలేయగా, అయ్యర్‌ మరో క్యాచ్‌ వదిలేశాడు. మిచెల్‌ స్కోరు 38 వద్ద రోహిత్‌ క్యాచ్‌ వదిలేయగా, ఫిలిప్స్‌ స్కోరు 27 వద్ద గిల్‌ క్యాచ్‌ వదిలేసి అవకాశమిచ్చాడు. ఆ తర్వాత కివీస్‌ కూడా గ్రౌండ్‌ ఫీల్డింగ్‌ అద్భుతంగా చేసినా... రెండు క్యాచ్‌లు వదిలేసింది. గిల్‌ 1 పరుగు వద్ద మిచెల్‌ క్యాచ్‌ వదిలేయగా, అయ్యర్‌ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు జేమీసన్‌ అతి సులువైన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. 12 రోహిత్‌ శర్మ వరుసగా 12వసారి టాస్‌ ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా (12) రికార్డును సమం చేశాడు. అయితే మ్యాచ్‌లు గెలుస్తూ ఐసీసీ టైటిల్‌ సాధించిన వేళ ఇలాంటి టాస్‌లు ఎన్ని ఓడిపోయినా రోహిత్‌కు లెక్క లేదు! ‘నేను రిటైర్‌ కావడం లేదు’ చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్‌ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్‌ మానసికంగా దృఢంగా ఉంటాడు. సరైన షాట్‌లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్‌ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్‌ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్‌ చేసేందుకు నన్ను కోచ్‌ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్‌ కావడం లేదు. ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను –రోహిత్, భారత కెప్టెన్ గొప్పగా అనిపిస్తోంది. ఆ్రస్టేలియాతో సిరీస్‌ తర్వాత సరైన రీతిలో పునరాగమనం చేయాలని భావించాం. కుర్రాళ్ళతో కలిసి ఆడటం ఎంతో బాగుంది. వారు సరైన సమయంలో స్పందిస్తూ జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. ఇన్నేళ్లుగా ఆడుతున్న తర్వాత ఒత్తిడి కొత్త కాదు. టైటిల్‌ గెలవాలంటే ఆటగాళ్లంతా రాణించాల్సి ఉంటుంది. అందరూ సమష్టిగా సత్తా చాటడంతోనే ఇది సాధ్యమైంది. సరైన, తగిన సమయం సమయం చూసి తప్పుకోవడం ముఖ్యం (రిటైర్మెంట్‌పై). –విరాట్‌ కోహ్లి

Sri Lakshmi Narasimha Swamy Brahmotsavalu in Kadiri 20258
కాటమరాయుడా.. కదిరి నరసింహుడా!

ఆ దేవుడు లక్ష్మీనారసింహుడు. భక్తులచేత వసంతవల్లభుడిగా, కాటమ రాయుడిగా, ప్రహ్లాదవరదుడిగా పూజలందుకుంటున్న శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం శ్రీసత్యసాయిజిల్లా కదిరిలో వెలసింది. ఖాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంకురార్పణంతో అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు పక్షం రోజులపాటు జరుగుతాయి. భక్తప్రహ్లాద సమేత నారసింహుని దర్శనం ఇక్కడ మాత్రమే చూడవచ్చు.స్థల పురాణంహిరణ్యకశిపుని సంహరించిన అనంతరం శ్రీవారు ఆ ఉగ్రరూపంలోనే సమీపంలోని కదిరి కొండ వద్ద సంచరించసాగారు. మహర్షులు ఆయనను శాంతింపజేసేందుకు ఆ కొండపై ఆలయాన్ని నిర్మించి స్వామివారిని అందులో వసించమని వేడుకున్నారు. అదే కొండపై శ్రీవారి పాదముద్రికలు కూడా ఉన్నాయి. అందుకే ఈప్రాంతాన్ని ‘ఖాద్రి’ అని పిలిచారు. ‘ఖా’ అంటే విష్ణుపాదమని, ‘అద్రి’ అంటే కొండ అని అర్థం. ఖాద్రి కాస్తా కదిరిగా పిలుస్తున్నారు.మహిమాన్వితుడు.. ఖాద్రీశుడుకదిరిప్రాంతంలో ఒకప్పుడు ఖాదిరి వృక్షాలు(చండ్ర వృక్షాలు) ఎక్కువగా ఉండేవి. వీటికింద ఒక పుట్టలో నారసింహుడు స్వయంభువుగా వెలిశాడని అందుకే ఖాద్రీ నారసింహుడని పిలు స్తున్నారని మరో కథనం. ప్రతి నెలా స్వాతినక్షత్రం రోజు మాత్రమే ఇక్కడ మూల విరాట్‌కు అభిషేకం చేస్తారు. వసంత వల్లభుడని పేరుశ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భృగు మహర్షి ఈప్రాంతంలో తపస్సు చేశాడని, అందుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిశానని, తన విగ్రహాలను వెలికితీసి పూజాది కార్యక్రమాలు చేయాలని కోరినట్లు ఓ కథనం. ఉత్సవ విగ్రహాల వెలికితీత జరిగింది వసంత మాసంలో కనుక స్వామివారికి వసంత వల్లభుడని పేరు కూడా ఉంది. అందుకే కోనేరును భృగుతీర్థమని పిలుస్తారు. ఆ ఉత్సవవిగ్రహాలనే ఇప్పటికీ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఇంతటి తేజస్సు కల్గిన ఉత్సవ విగ్రహాలు ఎక్కడా లేవని భక్తులు చెబుతారు.దేశంలోనే 3వ అతి పెద్ద బ్రహ్మరథంస్వామివారి బ్రహ్మ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మరథం తయారు చేశారు. రథంపై 256 శిల్పకళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్‌ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్‌ రథం తర్వాత 3వ అతి పెద్దది ఈ ఖాద్రీశుడి బ్రహ్మరథం. ఆదివారం (9న) అంకురార్పణతో మొదలయిన ఈ బ్రహ్మోత్సవాలలో రోజుకో వాహనం మీద స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. 22వ తేదీ తీర్థవాది ఉత్సవం, 23న పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి. మా వంశమంతా స్వామి సేవలోనే..తర తరాలుగా మా వంశాలు స్వామివారి సేవలోనే తరిస్తున్నాయి. అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. ప్రహ్లాద సమేత లక్ష్మీనారసింహుడి దర్శనం ఇంకెక్కడా ఉండదు. బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు జరిగేది కూడా ఇక్కడే. ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు మూలవిరాట్‌కు అభిషేకం చేస్తాం. – నరసింహాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులుబ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లుబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో రోజంతా నిత్యాన్నదానం ఉంటుంది. కల్యాణోత్సవంతో పాటు రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగేలా చూస్తున్నాం.– శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈఓ– చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరి, శ్రీసత్యసాయి జిల్లా

Indian team won Champions Trophy with complete dominance 9
వన్డే విజయం తెచ్చిన ఆనందం...

నవంబర్‌ 19, 2023... కోట్లాది మంది భారతీయుల ఆశలు మోస్తూ వన్డే వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌ బరిలోకి దిగిన భారత్‌ అనూహ్య పరాజయంతో అభిమానుల గుండెలు బద్దలయ్యాయి... జూన్‌ 29, 2024... టి20 ఫార్మాట్‌లో తమ స్థాయికి తగ్గ ఆటను కనబరుస్తూ భారత జట్టు వరల్డ్‌ కప్‌ గెలుచుకుంది...ఫ్యాన్స్‌కు కాస్త ఊరట... మార్చి 9, 2025... అంచనాలకు అనుగుణంగా ప్రతీ మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిక్యంతో భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ సాధించింది... దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఆనందం... సాక్షి క్రీడా విభాగం : సుమారు 16 నెలల వ్యవధిలో భారత జట్టు మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌ చేరింది. వాటిలో రెండింటిలో విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్‌ కప్‌ ఓటమి వేదన ఇప్పటికీ తీరనిది అయినా మిగతా రెండు విజయాలతో సాంత్వన దక్కిందనేది మాత్రం వాస్తవం. అంతర్జాతీయ క్రీడల్లో ఒక టోర్నమెంట్‌కు, మరో టోర్నమెంట్‌కు పోలిక ఉండదు. ఒక విజయానికి, మరో విజయానికి సంబంధం ఉండదు. దేని ప్రత్యేకత దానిదే. కానీ గెలుపు ఇచ్చే కిక్‌ మాత్రం ఎప్పుడైనా ఒకటే! ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు దానినే అనుభవిస్తున్నారు.వరల్డ్‌ కప్‌ కాకపోయినా టాప్‌–8 జట్ల మధ్య జరిగిన సమరంలో భారత్‌ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2013లో చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యులైన రోహిత్, కోహ్లి, జడేజా ఇప్పుడూ ఉన్నారు. 2017 ఫైనల్లో పాక్‌ చేతిలో ఓడిన వారిలో ఈ ముగ్గురితో పాటు హార్దిక్‌ పాండ్యా, షమీ కూడా ఉన్నారు. షమీ, అయ్యర్, రాహుల్, హర్షిత్‌ రాణా, వరుణ్, సుందర్‌లకు ఇదే తొలి ఐసీసీ టైటిల్‌. దాని విలువ ఏమిటో వారి ఆనందంలోనే కనిపిస్తోంది. స్పిన్నర్లే విన్నర్లు... చాంపియన్స్‌ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించినప్పుడు ‘ఐదుగురు స్పిన్నర్లా’ అంటూ అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. పైగా అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ఉన్న బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ను తప్పించి మరీ వరుణ్‌ చక్రవర్తిని ఎంపిక చేశారు. టోర్నీలో మన స్పిన్నర్ల ప్రదర్శన చూస్తే ఇది ఎంత సరైన నిర్ణయమో తేలింది. సుందర్‌కు మ్యాచ్‌ ఆడే అవకాశం రాకపోగా... మిగతా నలుగురు వరుణ్, కుల్దీప్, అక్షర్, జడేజా పెను ప్రభావం చూపించారు. ఈ నలుగురు కలిసి మొత్తం 26 వికెట్లు పడగొట్టారు. ఇందులో వరుణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కేవలం 15.11 సగటుతో అతను 9 వికెట్లు తీశాడు. లీగ్‌ దశలోనే కివీస్‌ పని పట్టిన అతను ఫైనల్లోనూ అదే ఆటను ప్రదర్శించి జట్టు విజయానికి కారణమయ్యాడు. కీలకమైన యంగ్, ఫిలిప్స్‌ వికెట్లు తీసిన అతను కనీసం ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం! టోర్నీకి ముందు అతను ఒకే ఒక వన్డే ఆడాడు. ‘వరుణ్‌ బౌలింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉంది. నెట్స్‌లో కూడా అతను మాకు మామూలుగానే బౌలింగ్‌ చేస్తాడు. తన అసలైన ఆయుధాలను మ్యాచ్‌లోనే ప్రదర్శిస్తాడు. అలా చేస్తే చాలు’ అంటు రోహిత్‌ చేసిన ప్రశంస వరుణ్‌ విలువను చూపించింది. ఆరంభంలో కుల్దీప్‌ పెద్దగా ప్రభావం చూపకపోయినా... తుది పోరులో రెండు కీలక వికెట్లతో కివీస్‌ను నిలువరించాడు. జడేజా, అక్షర్‌ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టి పడేశారు. వీరిద్దరి ఎకానమీ 4.35 మాత్రమే ఉందంటే వారు ఎంత పొదుపుగా బౌలింగ్‌ చేశారో అర్థమవుతుంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షమీ గతంలోలా అద్భుతంగా బౌలింగ్‌ చేయకపోయినా కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. టోర్నీలో అతను తీసిన 9 వికెట్లలో సెమీస్‌లో స్మిత్‌ను అవుట్‌ చేసిన క్షణం హైలైట్‌గా నిలిచింది. బుమ్రా లేని లోటును పూరిస్తూ ఈ సీనియర్‌ బౌలర్‌ తన వంతు పాత్రను పోషించాడు. బ్యాటర్లు సమష్టిగా... బ్యాటింగ్‌లో ఎప్పటిలాగే విరాట్‌ కోహ్లి (మొత్తం 218 పరుగులు) భారత జట్టు మూల స్థంభంగా నిలిచాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీతో రెండుసార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా అతను జట్టును గెలిపించాడు. టోర్నీకి ముందు అతని బ్యాటింగ్‌పై కాస్త సందేహాలు రేగినా... వాటిని అతను పటాపంచలు చేశాడు. కోహ్లినే స్వయంగా చెప్పినట్లు ఆ్రస్టేలియా టూర్‌ తర్వాత తాము ఒక విజయం కోసం చూస్తున్న స్థితిలో ఈ టైటిల్‌ దక్కింది. మొత్తం పరుగులు చూస్తే రోహిత్‌ శర్మ (180) తక్కువగానే కనిపిస్తున్నా... ఓపెనర్‌గా అతను చూపించిన ప్రభావం ఎంతో ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ (243) జట్టు అత్యధిక స్కోరర్‌గా నిలవగా, గిల్‌ (188 పరుగులు) ఒక సెంచరీతో తాను ప్రధాన పాత్ర పోషించాడు. తనపై వస్తున్న విమర్శలకు జవాబిస్తూ కేఎల్‌ రాహుల్‌ (140 పరుగులు) మూడు మ్యాచ్‌లలో చివరి వరకు నిలిచి జట్టును గెలుపు తీరం చేర్చాడు. ఐదో స్థానంలో ప్రమోట్‌ అయిన అక్షర్‌ పటేల్‌ (109 పరుగులు) కూడా ఆకట్టుకున్నాడు. టాప్‌–6 బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడటంతో ఆందోళన లేకపోయింది. ఐదు మ్యాచ్‌లలో భారత్‌ నాలుగు సార్లు సునాయాసంగా 232, 242, 265, 252 లక్ష్యాలను అందుకుంది. కెప్టెన్ గా రోహిత్‌ ముద్ర... భారత్‌ నుంచి ధోని మాత్రం కెపె్టన్‌గా ఒకటికి మించి ఐసీసీ టైటిల్స్‌ సాధించాడు. ఇప్పుడు రెండు ట్రోఫీలతో రోహిత్‌ శర్మ తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. మరో దాంట్లో ఫైనల్‌ కూడా చేర్చిన ఘనత, వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో సారథిగా వ్యవహరించిన ఘనత కూడా అతని ఖాతాలో ఉంది. చాంపియన్స్‌ ట్రోఫీలో కీలక సమయాల్లో కెప్టెన్ గా అతను జట్టును నడిపించిన తీరు హైలైట్‌గా నిలిచింది. గంభీర్‌కు ఊరట... ద్రవిడ్‌ నుంచి కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గంభీర్‌ కోచింగ్‌లో చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. శ్రీలంకపై టి20 సిరీస్, స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌ లు గెలిచినా వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆ తర్వాత ఆసీస్‌ చేతిలో టెస్టుల్లో చిత్తయిన అవమాన భారం మాత్రమే అందరికీ గుర్తుండిపోయింది.ఇలాంటి సమయంలో వచ్చిన గెలుపు కోచ్‌గా అతనికి ఊరటనిచ్చిoదనడంలో సందేహం లేదు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో సంతృప్తికరమైన ఆట ఎప్పటికీ ఉండదు. ప్రతీసారి ఏదో ఒక విషయం మెరుగు పర్చుకోవాల్సిందే. అప్పుడే నిలకడగా ఫలితాలు వస్తాయి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కోచ్‌ ఇప్పుడు ఫైనల్‌ అనంతరం చిరునవ్వులు చిందించాడు.ప్రధాని ప్రశంసలు... మూడోసారి చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘అద్భుతమైన మ్యాచ్‌...అద్భుతమైన ఫలితం... ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన మన క్రికెట్‌ జట్టును చూసి గర్వపడుతున్నా. టోర్నమెంట్‌ ఆసాంతం వారంతా చాలా బాగా ఆడారు. అసాధారణ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన మన జట్టుకు నా అభినందనలు’ అని ‘ఎక్స్‌’లో మోదీ పేర్కొన్నారు. టీమిండియాకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చందబ్రాబు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు.మాజీ సీఎం జగన్‌ అభినందనలు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు.7 భారత్‌ సాధించిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టైటిల్స్‌ సంఖ్య. ఇందులో 2 వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011), 2 టి20 వరల్డ్‌కప్‌లు (2007, 2024), 3 చాంపియన్స్‌ ట్రోఫీలు (2022, 2013, 2025) ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 10 ఐసీసీ టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉంది.ఎవరికెంత ప్రైజ్‌మనీ అంటే? విజేత భారత్‌ 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 52 లక్షలు) రన్నరప్‌ కివీస్‌ 11 లక్షల 20 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 76 లక్షలు)

Sakshi Special Story About Bank deposit insurance facility in india10
మీ బ్యాంక్‌ డిపాజిట్‌ ఎంత భద్రం?

ముంబైకి చెందిన ధన్‌రాజ్‌ (50) ఉదయం నిద్రలేచి, పేపర్‌ చూడగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. న్యూ ఇండియా సహకార బ్యాంక్‌లో స్కామ్‌ జరిగిందనేది ఆ వార్త సారాంశం. చిరుద్యోగి అయిన ధన్‌రాజ్‌ తన కుమార్తె వివాహం కోసమని రూ.4 లక్షలను అదే బ్యాంక్‌లో కొన్నాళ్ల క్రితం డిపాజిట్‌ చేశాడు. కంగారుగా బ్యాంక్‌ శాఖకు చేరుకుని విచారించగా, డిపాజిట్లకు ఢోకా లేదన్న సమాచారం విని కాస్తంత కుదుటపడ్డాడు. రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సదుపాయం ఉంటుందని కస్టమర్లు చెప్పుకుంటుండగా విని.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. బ్యాంక్‌ డిపాజిట్‌.. దేశంలో చాలా మందికి తెలిసిన, ఇష్టమైన పెట్టుబడి సాధనం. చాలా మంది తమ పొదుపు సొమ్మును డిపాజిట్‌ రూపంలో మదుపు చేయడం కూడా చూస్తుంటాం. కానీ, ఇందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన ఉండదు. డిపాజిటర్లు అందరూ దీనిపై ఓసారి దృష్టి సారించాల్సిన అవసరాన్ని న్యూ ఇండియా కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఉదంతం గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ప్రతి కుటుంబ ఆర్థిక సాధనాల్లో బ్యాంక్‌ డిపాజట్‌ (ఎఫ్‌డీ) తప్పకుండా ఉండేది. కాలక్రమంలో ఇతర సాధనాల పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు తదితర వాటిల్లో పెట్టుబడులు పెరుగుతూ, డిపాజిట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికీ 15 శాతం గృహ పొదుపులు బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోకే (ఎఫ్‌డీలు/టర్మ్‌ డిపాజిట్లు) వెళుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎఫ్‌డీలు ఎంతో మందికి నమ్మకమైన, మెరుగైన సాధనం. దీర్ఘకాలంలో గొప్ప రాబడి రాకపోయినా సరే, అత్యవసరంలో వేగంగా వెనక్కి తీసుకునేందుకు అనుకూలంగా ఉండడం చాలా మందికి నచ్చే అంశం. పైగా డిపాజిట్‌ అంటే ఏ మాత్రం రిస్క్‌ ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ప్రభుత్వ గ్యారంటీ (సావరీన్‌) ఉంటే తప్పించి, బ్యాంక్‌ ఎఫ్‌డీ అయినా, ఏ ఇతర పెట్టుబడి సాధనంలో అయినా ఎంతో కొంత రిస్క్‌ ఉంటుంది. దీనిపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. మెరుగైన నియంత్రణలు ఎఫ్‌డీ ఎంతో ప్రాచుర్యానికి నోచుకోవడం వెనుక అందులోని సరళత్వం, భద్రత కీలకమని చెప్పుకోవాలి. ఏవో కొన్ని బ్యాంకు వైఫల్యాలను పక్కన పెడితే, మన దేశంలో బ్యాంకింగ్‌ రంగం పటిష్ట నియంత్రణల మధ్య కొనసాగుతుంటుంది. ప్రజల్లో నమ్మకం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. బ్యాంక్‌ యాజమన్యాలు/ఉద్యోగుల మోసపూరిత వ్యవహారం, రుణ వ్యాపారంలో దూకుడైన తీరు కొన్ని సందర్భాల్లో సమస్యలు, సంక్షోభాలకు దారితీయవచ్చు. ఎంత కట్టుదిట్టమైన నియంత్రణలు ఉన్నా కానీ, 2019లో పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్, 2020లో యస్‌ బ్యాంక్, ఇప్పుడు న్యూ ఇండియా కోపరేటివ్‌ బ్యాంక్‌ సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ కరాడ్‌ ఉదంతాలూ గుర్తుండే ఉంటాయి. కనుక బ్యాంక్‌ డిపాజిట్లలోనూ రిస్క్‌ ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాకపోతే మనదగ్గర ఆర్‌బీఐ పటిష్ట నియంత్రణల కారణంగా ఈ తరహా సంక్షోభాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.డిపాజిట్‌పై బీమా ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని బ్యాంకుల్లోనూ రూ.5 లక్షల వరకు డిపాజిట్‌కు బీమా రక్షణ ఉంటుంది. అసలు లేదా అసలుతోపాటు వడ్డీ కలుపుకుని రూ.5 లక్షలకు మించి ఉన్నప్పటికీ బీమా రూ.5 లక్షలకే పరిమితం. బ్యాంక్‌ ఏదైనా సంక్షోభం పాలైతే అప్పుడు ఒక్కో డిపాజిట్‌ దారుడికి గరిష్టంగా రూ.5 లక్షలు వెనక్కి వస్తాయి. సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరెంట్, రికరింగ్‌ ఇలా అన్ని డిపాజిట్లకూ ఈ రక్షణ వర్తిస్తుంది. ఈ వ్యవహారం అంతా చూసేది ఆర్‌బీఐ అనుబంధ సంస్థ అయిన ‘డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (డీఐసీజీసీ). ప్రతి రూ.100 డిపాజిట్‌పై రూ.12 పైసలు చొప్పున ప్రీమియం కింద బ్యాంక్‌లు డీఐసీజీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒక బ్యాంక్‌కు చెందిన ఒకటికి మించిన శాఖలో డిపాజిట్లు ఉన్నప్పటికీ.. ఒక్కో ఖాతాదారుని పేరు మీద గరిష్ట బీమా రూ.5 లక్షలుగానే ఉంటుంది. కనుక ఒక బ్యాంక్‌లో రూ.5 లక్షలకు మించి చేసే డిపాజిట్‌పై కచ్చితంగా రిస్క్‌ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్‌లు చేస్తే.. అప్పుడు విడిగా ఒక్కో బ్యాంక్‌ పరిధిలో సంబంధిత వ్యక్తికి గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్‌కు బీమా రక్షణ వర్తిస్తుంది.బ్యాంక్‌ కుదుటపడితే.. బ్యాంకులో మోసం కావచ్చు. లేదా లిక్విడిటీ సంక్షోభం తలెత్తవచ్చు. రుణ ఎగవేతలతో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్‌బీఐ తప్పకుండా జోక్యం చేసుకుంటుంది. తాత్కాలిక నిర్వహణ బాధ్యతల కోసం బోర్డ్‌ను ఏర్పాటు చేస్తుంది. బ్యాంక్‌ వ్యవహారాలను లోతుగా పరిశీలించి, చక్కదిద్దే వరకు డిపాజిట్ల ఉపసంహరణపై పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధిస్తుంది. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌లో రుణ అవకతవకలు సంక్షోభానికి దారితీయగా, ఆర్‌బీఐ దాన్ని చక్కదిద్దింది. అది ఇప్పుడు యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో భాగం అయింది. యస్‌ బ్యాంక్‌లోనూ రుణ మోసాలు బయటపడగా, కొత్త బోర్డ్‌ను ఏర్పాటు చేసి గాడిన పెట్టింది. రూ.5 లక్షలకు పైగా డిపాజిట్లు కలిగిన వారు.., రూ.5 లక్షలకు పైబడిన మొత్తాన్ని తిరిగి పొందడం కోసం బ్యాంక్‌ గాడిన పడే వరకు వేచి చూడాల్సిందే. అప్పటికీ పూర్తి మొత్తం వెనక్కి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఎంత కోత పడుతుందన్నది బ్యాంక్‌ ఆర్థిక పద్దుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.బ్యాంకు నుంచే చెల్లింపులు బ్యాంక్‌లో సమస్య తలెత్తినప్పుడు డిపాజిట్‌దారులు డీఐసీజీసీని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్‌ నిర్వహణ బాధ్యతలు చూసే బోర్డ్‌.. డిపాజిట్‌దారుల వివరాలతో జాబితాను డీఐసీజీసీకి పంపిస్తుంది. ఆ వివరాల వాస్తవికతను 30 రోజుల్లోపు డీఐసీజీసీ తేల్చాలి. అక్కడి నుంచి 15 రోజుల్లోపు డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బ్యాంక్‌కు డీఐసీజీసీ బదిలీ చేస్తుంది. అప్పుడు ఖాతాదారులకు బ్యాంక్‌ సిబ్బంది చెల్లింపులు చేస్తారు. బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన నాటి నుంచి 90 రోజుల్లో డిపాజిట్‌దారులకు బీమా మొత్తం వెనక్కి చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. విచారించుకున్న తర్వాతే.. ఆర్‌బీఐ పరిధిలోని అన్ని బ్యాంక్‌లు తప్పనిసరిగా డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. అవి డిపాజిట్లపై బీమా ప్రీమియం కచ్చితంగా చెల్లించాల్సిందే. సందేహం ఉంటే డిపాజిట్‌ చేసే ముందు బ్యాంక్‌ అధికారిని అడిగి బీమా ఉందా? అని నిర్ధారించుకోవచ్చు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంక్‌లు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంక్‌లు, కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లు, లోకల్‌ ఏరియా బ్యాంక్‌లు, రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌లు, పేమెంట్స్‌ బ్యాంక్‌లు, స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లు, అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లు డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. ప్రైమరీ కో ఆపరేటివ్‌ సొసైటీలు మాత్రం దీని కిందికి రావు.అధిక వడ్డీ రేట్లు.. అన్నీ చూసాకే ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు యూనివర్సల్‌ బ్యాంకులతో పోల్చితే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తుంటాయి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు రుణాలపై అధిక రేట్లను చార్జ్‌ చేస్తుంటాయి. కనుక అవి డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ రేట్లను ఇస్తుంటాయి. ఏ బ్యాంక్‌ అయినా సరే అధిక వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తుంటే, అందులో ఇన్వెస్ట్‌ చేసే ముందు ఈ రేషియోలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. సీఆర్‌ఏఆర్‌: క్యాపిటల్‌ టు రిస్క్‌ అస్సెట్‌ రేషియో అని, దీన్నే క్యాపిటల్‌ అడెక్వెసీ రేషియో అని కూడా అంటారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు ఇది కనీసం 12 శాతంగా, ప్రైవేటు షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లకు 9 శాతం మేర ఉండాలి. అదే స్మాల్‌ ఫైనాన్స్‌బ్యాంక్‌లకు 15 శాతం ఉండాలి. బ్యాంక్‌ తనకు ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలను ఎంత సమర్థంగా ఎదుర్కోగలదన్నది ఇది తెలియజేస్తుంది. ఎల్‌సీఆర్‌: లిక్విడిటీ కవరేజీ రేషియో 100 శాతం ఉండాలి. 30 రోజుల అవసరాలకు సరిపడా నిధులు బ్యాంకుల వద్ద ఉంచడం కోసం ఈ నిబంధన. దీనివల్ల లిక్విడిటీ షాక్‌లను బ్యాంక్‌లు సమర్థంగా ఎదుర్కోగలవు. అసలు రాబడి ఎంత? అత్యవసర నిధిని అట్టి పెట్టుకునేందుకు, స్వల్పకాలిక అవసరాలకు ఉద్దేశించిన నిధులను బ్యాంక్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేసుకుంటానంటే ఫర్వాలేదు. కానీ, దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, సంపద సృష్టికి బ్యాంక్‌ డిపాజిట్‌ మెరుగైన సాధనం కాబోదు. ఈక్విటీలపై దీర్ఘకాలంలో 12 శాతం, బంగారంలో 8 శాతం మేర సగటు రాబడి ఉంటోంది. ఈక్విటీ, బంగారంలో పెట్టుబడిని విక్రయించినప్పుడే లాభాలపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్‌ డిపాజిట్లపై అలా కాదు. ప్రతి ఏటా ఆర్జించే వడ్డీ రాబడి అదే ఏడాది ఇన్వెస్టర్‌ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. అవసరమైతే పన్ను చెల్లించాలి. ఎఫ్‌డీ రాబడిపై పన్ను చెల్లించగా, మిగిలే నికర రాబడి ద్రవ్యోల్బణ స్థాయిలోనే ఉంటుంది. కనుక డిపాజిట్లలో కాంపౌండింగ్‌ ప్రయోజనం పెద్దగా ఉండదు.బీమా మరింత పెంచేనా..? 2019లో పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌లో సంక్షోభం తలెత్తిన తర్వాతే.. డిపాజిట్లపై రూ.లక్షగా ఉన్న బీమా పరిమితిని 2020 ఫిబ్రవరిలో రూ.5 లక్షలకు పెంచారు. ఈ బీమా రక్షణను మరింత పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ఇటీవల చేసిన ప్రకటన ఈ దిశగా డిపాజిటర్లలో అంచనాలను పెంచింది. ఇప్పటికిప్పుడు దీన్ని పెంచకపోయినా, భవిష్యత్తులో ఇందుకు తప్పక అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిట్ల సంగతేంటి? బజాజ్‌ ఫైనాన్స్, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ తదితర డిపాజిట్లు స్వీకరించే ఆర్‌బీఐ అనుమతి కలిగిన ఎన్‌బీఎఫ్‌సీలు (ఎన్‌బీఎఫ్‌సీ–డీ) దేశంలో 25 ఉన్నాయి. వీటి పరిధిలో 2024 మార్చి నాటికి రూ.1,02,994 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మరి ఉన్నట్టుండి వీటిల్లో ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీకి నిధుల సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి? బ్యాంకుల్లో మాదిరి వీటిల్లో డిపాజిట్‌లకు డీఐసీజీసీ కింద ఎలాంటి బీమా రక్షణ లేదు. ఇవన్నీ ప్రజల డిపాజిట్లే కనుక వీటిని సైతం డీఐసీజీసీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిల్లో డిపాజిట్‌ చేసే ముందు ఇన్వెస్టర్లు రిస్క్ లను అర్థం చేసుకోవాలి. బ్యాంకులకూ రేటింగ్‌ ఉండాలి.. ఎన్‌బీఎఫ్‌సీలు తమ నిధుల అవసరాల కోసం బాండ్లు, ఎన్‌సీడీలను జారీ చేస్తుంటాయి. సంబంధిత ఎన్‌బీఎఫ్‌సీ ఆర్థిక ఆరోగ్యం ఆధారంగా రేటింగ్‌ ఏజెన్సీలు క్రెడిట్‌ రేటింగ్‌ను ప్రకటిస్తాయి. నిబంధనల ప్రకారం రేటింగ్‌ తప్పనిసరి. బ్యాంక్‌లు సైతం బాండ్లను జారీ చేయాలంటే రేటింగ్‌ తీసుకోవాల్సిందే. కానీ బ్యాంక్‌ డిపాజిట్లకు వచ్చే సరికి ఈ తరహా రేటింగ్‌ విధానం లేకపోవడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్‌ డిపాజిట్లకు సైతం రేటింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల పాలన మెరుగుపడుతుందని ఎన్‌ఎస్‌జీ అండ్‌ పార్ట్‌నర్స్‌ పార్ట్‌నర్‌ రవి భడానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల డిపాజిట్‌ చేసే సమయంలో ఆయా బ్యాంక్‌లకు సంబంధించి రిస్క్ ను ఇన్వెస్టర్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా చేస్తే అప్పుడు బలహీన బ్యాంక్‌ల నుంచి అధిక రేటింగ్‌ ఉన్న బ్యాంకుల్లోకి డిపాజిట్లు తరలిపోయే రిస్క్‌ ఏర్పడుతుందని ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ సతీష్‌ మరాటే పేర్కొన్నారు. దీనికి బదులు మెరుగైన రేటింగ్‌ ఉన్న బ్యాంకులకు డిపాజిట్లపై బీమా ప్రీమియం తక్కువ వసూలు చేసే విధానం ఫలితమిస్తుందన్నారు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
White House: గన్ తో సంచరిస్తున్న వ్యక్తి కాల్చివేత

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ కు కూతవే

title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ వింత కోరిక.. ట్రంప్‌ అందుకు ఒప్పుకుంటారా?

వాషింగ్టన్‌: అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు

title
ఐఎస్‌ఎస్‌ కమాండ్‌ బాధ్యతలు.. రష్యా వ్యోమగామికి అప్పగించిన సునీత

వాషింగ్టన్‌: కేవలం పది రోజుల మిషన్‌ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో 9 నెలలపాట

title
వీడియో: న్యూయార్క్‌లో కార్చిర్చు మంటలు.. ఎమర్జెన్సీ విధింపు

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో కార్చిర్చు అంటుక

title
భారత్‌ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్‌ ధ్వంసం

కాలిఫోర్నియా: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది.

NRI View all
title
న్యూయార్‌లో ఘనంగా తెలుగువారి సంబరాలు.

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

title
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

title
విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?

విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్‌ కథా చిత్రం..

title
లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్‌బుక్

title
న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ

National View all
title
సీఎం నితీష్‌కు మీరు ఏదో ఆఫర్ చేశారంట కదా?

పాట్నా:  ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక

title
TG: తుది దశకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

ఢిల్లీ ; తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎంఎల్‌సీ అభ్యర్థుల ఖరారు అంశం తు

title
ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని

న్యూఢిల్లీ:  భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరలో కోల

title
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అ‍స్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌(Jagdeep Dhankar) అస

title
సెలవు లేదన్న హెడ్మాస్టర్‌.. లెక్కల టీచర్‌ ఏం చేశారంటే?

భువనేశ్వర్‌: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం

Advertisement

వీడియోలు

Advertisement