ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. 2014లో తొలిసారిగా నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి ప్రధాని అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఈ స్థానం నుంచి 25 మంది అభ్యర్థులతో తలపడ్డారు.
నాడు ప్రధాని మోదీతో పోటీపడిన 25 మంది అభ్యర్థుల్లో 22 మంది డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇద్దరు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. నాడు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌కు ఒక లక్షా 95 వేల 159 ఓట్లు రాగా, మొత్తం ఓట్లలో ఇవి 18.40 శాతం. మూడో స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన అజయ్‌రాయ్‌కు 14.38శాతం ఓట్లు వచ్చాయి. గత లోక్ సభ ఎన్నికల్లో అజయ్ రాయ్ ఖాతాలో లక్షా 52 వేల 548 ఓట్లు పడ్డాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ వారణాసి నుంచి 4 లక్షల 79 వేల 505 ఓట్లతో విజయం సాధించారు. 2014లో తొలిసారిగా వారణాసి స్థానం నుంచి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. నాడు కాంగ్రెస్ తరఫున అజయ్‌రాయ్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి కైలాష్ చౌరాసియా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అజయ్ రాయ్‌కు 75 వేల 614 ఓట్లు రాగా, కైలాష్ చౌరాసియాకు 45 వేల 291 ఓట్లు వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన విజయ్ ప్రకాశ్ జైస్వాల్‌కు 60 వేల 579 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచి రెండు లక్షల, తొమ్మిది వేల 238 ఓట్లు దక్కించుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి నరేంద్ర మోదీకి ఐదు లక్షల ఒక వేయి 22 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 56.37 శాతం. నాడు మోదీ మూడు లక్షల 71 వేల 784 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
నరేంద్ర మోదీ వారణాసి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రధాని మోదీ గత విజయాలను అధిగమిస్తారని బీజేపీ చెబుతోంది. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. వారణాసి స్థానం నుంచి కాంగ్రెస్ మరోసారి అజయ్ రాయ్‌కు అవకాశం కల్పించగా, ఆయనకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతుగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment