న్యూఢిల్లీ: కోల్‌కతా అభయ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సస్పెండ్ చేసింది.
ఆర్‌జీకార్ అభయపై జరిగిన దారుణంలో సందీప్ ఘోష్ ప్రమేయం ఉందని తేలలేదు. అయినప్పటికీ ఘటన జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం, ఆత్మహత్య అని బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై సీబీఐ సైతం దర్యాప్తు చేస్తుంది.
అదే సమయంలో ఆర్‌జీకార్ మాజీ డాక్టర్, ప్రస్తుత ముర్షిదాబాద్ వైద్య కళాశాల డిప్యూటీ సుపరింటెండెంట్ అక్తర్ అలీ సందీప్ ఘోష్‌పై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. మృతదేహాలతో వ్యాపారం,బయోమెడికల్ వ్యర్థాలను అక్రమంగా రవాణా చేశారని ఆరోపించారు.
ఈ ఆరోపణలతో సీబీఐ అధికారులు సందీప్ ఘోష్‌ను 90 గంటల పాటు ప్రశ్నించారు. దీంతో పాటు ఆయన ఇల్లు, ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సైతం 11 గంటల పాటు సోదాలు జరిపారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేశారు.
ఈ తరుణంలో ఐఎంఏ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఐఎంఏ సస్పెండ్ చేసింది. వైద్యురాలి మరణంతో పాటు ఆమె కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యం, సానుభూతి లేకపోవడాన్ని ప్రస్తావించింది. తన తీరుతో సందీప్ ఘోష్ వైద్యవృత్తికి చెడ్డపేరు తెచ్చారని, క్రమశిక్షణా కమిటీ అతనిని సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని ఐఎంఏ తెలిపింది.
కాగా,ఆర్‌జీ కార్ ఆస్పత్రి వైద్యురాలి మరణం అనంతరం జరిగిన పరిణామలపై సందీప్ ఘోష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కొన్ని గంటల్లోనే మమతా ప్రభుత్వం అతన్ని కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు ప్రిన్సిపల్‌గా నియమించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment