గతం కంటే ఎక్కువ ధర వసూలు
శాసన మండలిలో విపక్షనేత బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సంక్షోభం నెలకొందని, 4 నెలలు గడిచినా ప్రభుత్వం ఇప్పటికీ ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోతోందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. లాసన్స్‌బే కాలనీలోని కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వాకం వల్ల నిర్మాణ రంగం కుదేలు కాగా, దానిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా, వాస్తవానికి గత ప్రభుత్వంలో కంటే ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితం అని ప్రకటిస్తున్న నేపథ్యంలో సీనరేజ్ చార్జీలు రూ.3,500 తగ్గించి, 10 టన్నుల ఇసుకను రూ.10 వేలకే సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ భాగస్వాములు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు. ఈ ఏడాది మార్చిలో విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసుపై సీఎం, డీజీపీ, సీబీఐకి లేఖ రాస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment