
● సబ్జెక్టుతో సంబంధం లేకుండా టీచర్లకు విధులు ● నష్టమే తప్ప ప్రయోజనం లేదంటున్న ఉపాధ్యాయులు ● జిల్లాలో 115 మందికి ఉత్తర్వులు
ఆదిలాబాద్‌టౌన్: విద్యాశాఖలో ఉపాధ్యాయుల సర్దుబాటు గందరగోళంగా మారింది. పదో తరగతి విద్యార్థుల చదువు దృష్ట్యా కలెక్టర్ రాహుల్‌రాజ్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని విద్యాశా ఖ అధికారులను ఆదేశించారు. అయితే అధికారులు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన ప్రక్రియ చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ఎస్జీటీలను సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఉన్నత పాఠశాలలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. విద్యార్థులకు ప్రయోజనం చేకూరడమేమో కానీ నష్టమే తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
సబ్జెక్టుతో సంబంధం లేకుండా..
పదో తరగతి ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఖాళీ గా ఉన్న పాఠశాలలకు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 115 మందికి విధులు కేటాయించారు. అయితే తెలుగు మీడియంలో బోధించే ఉపాధ్యాయులకు ఉర్దూ, మరాఠీ, హిందీ సబ్జెక్టులు చెప్పాలని ఉత్తర్వులు జారీ చేయడంతో వారు అవా క్కవుతున్నారు. సబ్జెక్టుతో సంబంధం లేనివారికి కూడా విధులు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు చేపడతాని హెచ్చరిస్తున్నట్లు పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. పనిచేసే మండలంలో కాకుండా ఇతర మండలాల్లో వారికి నచ్చిన చోట విధులు కేటాయించారు.
గందరగోళం..
సబ్జెక్టుతో సంబంధం లేనివారికి విధులు కేటాయించడంతో పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. దీంతోపాటు వారు పనిచేసే నుంచి ఇతర పాఠశాలలకు కేటాయించడంతో అక్కడి విద్యార్థులకు కూడా ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఒక్కో ఉపాధ్యాయుడు రెండేసి పాఠశాలలకు వెళ్లి బోధన చేయాలనడంతో వారు ఏ పాఠశాలకు వెళ్లి పాఠాలు చెప్పాలో అర్థంకాని పరిస్థితి.
సర్దుబాటు ఇలా..
● ఆదిలాబాద్‌లోని కేఆర్‌కే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీ తన సబ్జెక్టు బీఎడ్‌లో సాంఘిక శాస్త్రం కాగా, జెడ్పీఎస్‌ఎస్ వాగాపూర్‌లో హిందీ చెప్పాలని ఉత్తర్వులు జారీ చేశారు.
● తలమడుగు మండలం ఉండం పాఠశాలలో బోధించే ఎస్జీటీ తన సబ్జెక్టు గణితం కాగా, తలమడుగు పాఠశాలలో బయోసైన్స్ బోధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
● బోథ్ మండలం కరత్వాడ ప్రాథమిక పాఠశాలలో 33 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, ఒకరిని బోథ్ పాఠశాలకు సర్దుబాటు చేశారు. దీంతో ఈ బడి ఏకోపాధ్యాయ పాఠశాలగా మారింది.
● నార్నూర్ జెడ్పీఎస్‌ఎస్‌లో తెలుగుమీడియం గ ణితం బోధించే ఉపాధ్యాయుడికి ఉర్దూ మీడి యం బోధించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
● బజార్‌హత్నూర్‌లో పనిచేసే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్‌ను ఆదిలాబాద్‌లోని హిందీ మీడియం పాఠశాలకు సర్దుబాటు చేశారు.
● నార్నూర్ జెడ్పీఎస్‌ఎస్‌లో ఇద్దరు గణితం ఉపాధ్యాయులు ఉండగా, ఒకరిని గాదిగూడ మండలం ఉన్నతి కార్యక్రమ నోడల్ అధికారిగా విధులు కేటాయించగా, మరొకరికి తెలుగు మీడియం నుంచి ఉర్దూ మీడియంకు సర్దుబాటు చేశారు.
● బేల మండలం మణియార్‌పూర్‌కు చెందిన ఎస్జీటీకి రెండు పాఠశాలల్లో ఫిజిక్స్, గణితం బోధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. బేలలో ఉద యం గణితం, మధ్యాహ్నం ఫిజికల్ సైన్స్, మరుసటి రోజు కొగ్దూర్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ బోధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
● బోథ్ మండలం ధన్నూర్ పాఠశాలలో పనిచేసే హెచ్‌ఎంకు సబ్జెక్టుతో సంబంధం లేకుండా హిందీ బోధించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
● బేల మండలం బాధి యూపీఎస్‌లో పనిచేసే ఎస్జీటీకి సిర్సన్న పాఠశాలకు ఇంగ్లిష్ బోధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. బాధి పాఠశాలలో 120 విద్యార్థులు ఉండగా, ఒక్కరు మాత్రమే ఎస్‌ఏ ఉన్నారు. ఈ టీచర్ ఆ పాఠశాలలో గణి తం, ఇంగ్లిష్ సబ్జెక్టులను ప్రస్తుతం బోధిస్తున్నా రు. సర్దుబాటుతో ఈ విద్యార్థులకు అన్యాయం జరగనుంది.
డీఈవో కార్యాలయం
పది విద్యార్థుల దృష్ట్యానే..
ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలికంగా సర్దుబాటు చేయడం జరిగింది. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టాం. ఈ సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులు కేటాయించిన పాఠశాలల్లో ఒక సబ్జెక్టు మాత్రమే బోధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉపాధ్యాయులు పనిచేస్తున్న సమీప పాఠశాలల్లోనే సర్దుబాటు చేశాం.
– ప్రణీత, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment