వాంకిడి(ఆసిఫాబాద్): పదేళ్ల బాలికకు పాముకాటుతో నూరేళ్లు నిండాయి. ఈ విషాదకర ఘటన శుక్రవారం కుమురంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండల కేంద్రంలోని మజీద్‌వాడలో నివాసం ఉంటున్న బావునె సునీత, విలాస్ దంపతులకు కుమారుడు, కుమార్తె కల్పన(10) ఉన్నారు. కల్పన స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.
శుక్రవారం విలాస్ చౌపన్‌గూడకు పని కోసం వెళ్లగా, తల్లితో కలిసి బాలిక ఇంట్లోనే ఉంది. బెడ్‌పై పడుకుని ఇంటి గోడ సెల్ఫ్‌లపై కాళ్లు పెట్టి సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండగా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ విషసర్పం కల్పన ఎడమ కాలు బొటన వేలి కింద కాటేసింది. దీంతో కాలును గట్టిగా కదపడంతో బెడ్ బలంగా తాకి తీవ్ర రక్తస్రావమైంది. ఇంట్లోనే ఉన్న తల్లి గమనించినా కాలుపై రక్తం ఎక్కువగా ఉండటంతో పాముకాటు పసిగట్టలేకపోయింది.
ఆ తర్వాత విషయం తెలుసుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అనంతరం ఆసిఫాబాద్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కల్పన తండ్రి విలాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment