
● జాతర నిర్వహణకు నిధుల కేటాయింపు ● కాంగ్రెస్ సర్కార్ హయాంలో తొలిసారి.. ● వచ్చేనెల 9నుంచి మహాపూజతో షురూ.. ● ఐటీడీఏ ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షణ
సాక్షి, ఆదిలాబాద్: నాగోబా జాతర నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మహాజాతర నిర్వహణకు రూ.20లక్షల నిధులు కేటాయించింది. నాగోబా కొలువుదీరిన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జాతర నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పనులు ప్రారంభించింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఈ మహాజాతర నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిధుల కేటాయింపుతో పాటు ఏర్పాట్లు ఘనంగా చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
వచ్చే నెల 9నుంచి..
ఫిబ్రవరి 9న నాగోబా మహాపూజతో జాతర ప్రారంభించనున్నారు. ఆదివాసీల్లోని మెస్రం వంశీయుల ఇలవేల్పు నాగోబా. ఏటా మహాజాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధికసంఖ్యలో ఆదివాసీలు తరలివస్తారు. జాతర జరిగే రోజుల్లో పలు మెస్రం కుటుంబీకులు నాగోబా ఆలయ పరిసరాల్లో కుటీరాలు ఏర్పాటు చేసుకుని బస చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లలో ఎక్కడా లోపం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈనెల 14వ తేదీన నెలవంక కనిపించడంతో దీనికి సంబంధించిన ప్రక్రియను మెస్రం వంశీయులు మొదలుపెట్టారు. ఆరోజు నుంచి మహాపూజల నిర్వహణపై ప్రచారం చేసేందుకు మెస్రం వంశీయులున్న గ్రామాలను చుట్టి వస్తున్నారు. ఈనెల 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత కేస్లాపూర్ నుంచి జన్నారంలోని గోదావరి హస్తినమడుగు నుంచి పవిత్ర గంగాజలాలను సేకరించేందుకు పాదయాత్ర నిర్వహిస్తారు. నాగోబా జాతరకు మూడురోజుల ముందు తిరిగి కేస్లాపూర్ చేరుకుంటారు. ఈ పవిత్ర గంగాజలంతో అభిషేకం చేస్తారు. ఈ నేపథ్యంలో మహాజాతరకు ముందు జరిగే పాదయాత్రకు కూడా ప్రాధాన్యం ఉంది.
ఐటీడీఏ ఆధ్వర్యంలో పర్యవేక్షణ..
ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో కేస్లాపూర్‌లో నాగోబా మహాజాతరకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పీవో చాహత్ బాజ్‌పాయ్ పర్యవేక్షణలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా భక్తుల కోసం తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నారు. శాశ్వత మరుగుదొడ్లు, స్నానపు గదులున్నా జాతర సమయంలో వచ్చే భక్తులకు సరిపోవు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా మరిన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేస్లాపూర్ ముఖద్వారం నుంచి నాగోబా ఆలయానికి వచ్చే దారిలో రోడ్ల మరమ్మతు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. జాతర సమయంలో పర్యవేక్షణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు భోజనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా జాతర జరిగే సమయంలో పారిశుధ్య నిర్వహణ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షణలో పారిశుధ్య నిర్వహణ పనులు ప్రారంభించారు.
పనులు ప్రారంభించాం
నాగోబా జాతర కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. వీటితో జాతర కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పనులు ప్రారంభించాం. జాతర నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఎక్కడ లోటుపాట్లు రాకుండా చర్యలు చేపడుతున్నాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం.
– చాహత్ బాజ్‌పాయ్,
ఐటీడీఏ పీవో, ఉట్నూర్
Comments
Please login to add a commentAdd a comment