మహిళ మెడలో పుస్తెల తాడు అపహరణ
ఆదిలాబాద్‌టౌన్: నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును అపహరించిన ఘటన జిల్లాకేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు కథనం ప్రకారం.. పట్టణంలోని భాగ్యనగర్‌కు చెందిన చెట్లవార్ మౌనిక తన కుమార్తెను పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు మధ్యాహ్న సమయంలో పాఠశాలకు వెళ్లింది. తాటిగూడలోని శిశుమందిర్ గేటు తీసేందుకు ప్రయత్నించగా ఆమెకు సాయం చేస్తున్నట్లుగా నటించి ఆమె మెడలో రెండు తులాల పుస్తెల తాడును లాక్కుని పరారయ్యాడు. శుక్రవారం రెక్కీ నిర్వహించినట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. లూనాపై వచ్చిన దుండగుడు ఆమెను వెంబడించాడు. ముఖం కనిపించకుండా మాస్కు ధరించాడు. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
భైంసారూరల్: మండలంలోని పేండ్‌పెల్లికి చెందిన షేక్ హుస్సేన్(58) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మాలిక్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..షేక్ హుస్సేన్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతకొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. కుటుంబీకులు శనివారం లేచి చూసేసరికి హుస్సేన్ ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. వారి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మన్మద్‌లో ఒకరు..
లోకేశ్వరం: మండలంలోని మన్మద్ గ్రామంలో మహారాష్ట్రలోని పిప్పల్‌గాం గ్రామానికి చెందిన డబ్బేకర్ బీరప్ప(42) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఆశోక్ కథనం ప్రకారం.. బీరప్ప అక్కబావ నాగరిబాయి, మల్లయ్యలు మన్మద్‌లో ఓ రైతు వద్ద పాలేరుగా పని చేస్తున్నారు. బీరప్పకు నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామానికి చెందిన లక్ష్మితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆమె కందకుర్తిలోని పుట్టింటికి వెళ్లింది. భర్త శుక్రవారం కందకుర్తికి వెళ్లి లక్ష్మిని కాపురానికి రావాలని కోరగా నిరాకరించింది. దీంతో మనస్తాపానికి చెందిన ఆయన అదేరోజు రాత్రి మన్మద్ గ్రామంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. .
Comments
Please login to add a commentAdd a comment