సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ యం కమలనాథుల్లో జోష్ నింపింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని కై వసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎమ్మెల్సీ పోరులో నువ్వా నేనా అన్నట్లు తలపడగా.. బీజేపీ బలపర్చిన అభ్యర్థి మల్క కొమురయ్యకే టీచర్లు పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి గా నాలుగు ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుని మరోసారి సత్తా చాటింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల మద్దతుతో ఓ సీటులో విజయం సాధించింది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఎమ్మెల్సీ సైతం ఆ పార్టీ ఖాతాలో చేరింది. ఉమ్మడి జిల్లాలో గత రెండేళ్లుగా బీజేపీ అనుకూల పవనాలే వీస్తున్నాయి. దీంతో భవిష్యత్‌లో తమ పార్టీ బలపడుతుందనే సంకేతాలు వస్తున్నాయని కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా పార్టీ పుంజుకోవడంపై ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేయాలనుకున్న పార్టీ సీనియర్లకు ఊరట కలుగుతోంది. మరోవైపు తాజా ఎన్నికలతో యువత, టీచర్లు, విద్యావంతులు బీజేపీ వైపు ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.
కలిసొచ్చిన ఆత్మీయ సమ్మేళనాలు
శాసనమండలి ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదటి నుంచి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టభద్రులు, టీచర్ల స్థానానికి బరిలో దింపి స్థానిక నాయకులపైనే భారం వేసింది. కార్పొరేట్ వ్యక్తులుగా ప్రచారం జరిగినా మల్క కొమురయ్య, పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డికి సానుకూలత పెరిగింది. పట్టణాలు, నియోజకవర్గాల్లో ఓటర్లను అధిక సంఖ్యలో రప్పించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం గెలుపునకు దోహదం చేశాయి. ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించి ప్రచా రం చేపట్టారు.
వచ్చే స్థానిక సంస్థల్లోనూ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్ని కల్లోనూ సత్తా చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామాలు, బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. పట్టణాలకే పరిమితమైన ఓటు బ్యాంకును గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాషా య పార్టీ బలపడేందుకు సరైన సమయం వచ్చింద ని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన పార్టీ ఇక గ్రామ స్థాయిలోనూ విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఫలితాలతో నాయకులకు ఊరట
పట్టభద్రుల స్థానంలోనూ గెలుస్తామనే ధీమా
ఉమ్మడి జిల్లా పార్టీ కేడర్‌లో ఉత్సాహం
మరో సీటుపై ఉత్కంఠ
మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గత రెండు రోజులుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు, ఓట్లు ఎక్కువగా ఉండడంతో లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి మంగళవారం సాయంత్రం వరకు ముందంజలో ఉన్నారు. ఏ అభ్యర్థి గెలుస్తారనేది బుధవారం స్పష్టత రానుంది. ఓట్ల లెక్కింపులో ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల తొలగింపు ప్రక్రియ మొదలైతే తుది విజేత ఎవరనేది తేలాల్సి ఉంది. బీజేపీ శ్రేణులు తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment