ఆకాంక్ష చాటేలా.. ప్రజల గొంతుకగా నిలిచేలా
● ‘సాక్షి’ ఆధ్వర్యంలో నేడు చర్చా వేదిక
అడవుల జిల్లా ఆకాంక్షను ఈ ప్రాంతవాసుల గొంతుక గా వినిపించేందుకు ‘సాక్షి’ నడుం బిగించింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న విమానాశ్రయ ఏర్పాటు అంశం ఆచరణలోకి రావాల్సిందే అని బలంగా కాంక్షిస్తోంది. కొత్త ఎయిర్‌పోర్టుల విషయంలో తెలంగాణలోని పలు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయం విదితమే. మామునూరులో నిధులు సైతం మంజూరు కాగా.. కొత్తగూడెంలోనూ కదలిక మొదలైంది. పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి ప్రస్తావన కూడా వచ్చేసింది. అయితే ‘మేమేం పాపం చేశాం.. మా కెందుకు మంజూరు చేయరు..’ అంటూ జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన వనరులు అందుబాటులో ఉన్నా ఎందుకు ఈ చిన్నచూపు అంటూ మౌనంగా నిట్టూరుస్తున్నారు. ఈ క్రమంలో ‘సాక్షి’ సామాజిక బాధ్యతగా ముందడుగు వేసింది. ‘ఆదిలాబాద్ విమానాశ్రయ సాధన’ పేరిట ప్రత్యేక చర్చా వేదికకు శ్రీకారం చుట్టింది. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసేలా ఆహ్వానం పలుకుతోంది. అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చాలని ఆకాంక్షిస్తోంది. మీ భావాలకు అక్షర రూపం కల్పించి పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు సదా మీ వెంటే అంటూ ‘సాక్షి’ విన్నవిస్తోంది. – కైలాస్‌నగర్
స్థలం : టీఎన్జీవోస్ భవన్, ఆదిలాబాద్
సమయం : ఉదయం 11నుంచి
మధ్యాహ్నం 1గంట వరకు
Comments
Please login to add a commentAdd a comment