ఉచిత ఇసుక సాధ్యమేనా..!? | - | Sakshi
Sakshi News home page

ఉచిత ఇసుక సాధ్యమేనా..!?

Published Sat, Apr 19 2025 4:55 AM | Last Updated on Sat, Apr 19 2025 4:55 AM

ఉచిత

ఉచిత ఇసుక సాధ్యమేనా..!?

కై లాస్‌నగర్‌: ప్రభుత్వ నిర్మాణాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. ఈమేరకు పెన్‌గంగలో ఇసుక లభ్యతపై సంబంధిత శాఖల అధికారులు ఇటీవల సంయుక్తంగా అధ్యయనం చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో ఇసుక తవ్వకాలు చేపడుతున్న గ్రామాలను పరిశీలించారు. అందులో సరిపడా లభ్యత లేనట్లుగా గుర్తించారు. అక్రమ తవ్వకాలు ఆపకుంటే భవిష్యత్తులో ఆయా గ్రామాల్లో భూగర్భజలాలకు ముప్పువాటిల్లే ప్రమాదమున్నట్లుగా అంచనా వేశారు. ఈ పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుక సరఫరా సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది.

12 గ్రామాల్లో పరిశీలన ..

పెన్‌గంగ నది పరీవాహక ప్రాంతంలో ఇసుక అర కమ తవ్వకాలు చేపడుతున్న12 గ్రామాల్లో మైనింగ్‌, భూగర్భజలనవనరులు, రెవెన్యూ శాఖల అధి కారులు ఇటీవల క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. భీంపూర్‌ మండలంలో వడూర్‌, అంతర్గా, తాంసి–కే, బేల మండలంలో సాంగిడి, కామ్‌గర్‌పూర్‌, భోరజ్‌లో డోలరా, కామాయి, కొరటా, జైనథ్‌లో పెండల్వాడ, ఆనంద్‌పూర్‌, సాంగ్వీ, కౌట గ్రా మాల్లో సంయుక్త పరిశీలన చేపట్టారు. వాల్టా చట్టం నిబంధనల ప్రకారం నదిలో ఇసుక లభ్యత లేనట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు సైతం ప్ర భుత్వ పనులకు ఉపయోగకరంగా ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌ రాజర్షి షాకు నివేదిక సైతం అందజేసినట్లుగాసమాచారం.

ఆపకుంటే ముప్పే..

నదిలో కొంతమంది యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. సమీప గ్రామాల్లో ఏర్పాటైన వీడీసీలు జోరుగా ఇసుక వేలం నిర్వహిస్తున్నాయి. దీంతో వాటిని దక్కించుకున్న అక్రమార్కులు పొక్లెయిన్లతో ఏళ్లుగా టిప్పర్లు, లారీల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే ప్రస్తుతం భూగర్భ జలాలకు పెనుముప్పుగా పరిణమించింది. ఈ క్రమంలో ఇటీవల ఆయా గ్రామాల్లో పర్యటించిన అధికారులు ఈ అంశాన్ని నిర్ధారించారు. యథేచ్ఛగా చేపట్టిన తవ్వకాలతోనే నదిలో నీటి నిల్వలు సైతం లేకుండా పోయాయనే అంచనాకు వచ్చారు. అక్రమ తవ్వకాలు తక్షణం ఆపకుంటే భవిష్యత్తులో సమీప గ్రామాల్లో భూగర్భజలమట్టం ప్రమాదకరస్థాయికి పడిపోయే ముప్పు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

సరఫరా సాధ్యపడేనా...

వాల్టాచట్టం ప్రకారం నదిలో ఇసుక నిల్వలు అంతగా లేవని, తవ్వకాలకు ఆస్కారం లేదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. మరోవైపు వీడీసీలకు కళ్లెం వేసేలా జిల్లా అధికారులు ఇటీవల చర్యలు చేపట్టారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్త తనిఖీలు చేస్తూ ఇసుక నిల్వలను సీజ్‌ చేయడంతో పాటు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అయినా అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వ పనులకు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా సాధ్యమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

పెన్‌గంగలో లభ్యతపై అధికారుల అధ్యయనం

సరిపడా నిల్వలు లేనట్లుగా గుర్తింపు

మరోవైపు ఆగని అక్రమ రవాణా

ఇందిరమ్మ ఇళ్లకు సరఫరాపై మల్లగుల్లాలు

కలెక్టర్‌ ఆదేశాల మేరకు చర్యలు

ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రభుత్వ అవసరాలకు ఉచితంగా అందించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ, మైనింగ్‌, భూగర్భజలవనరుల శాఖల అధికారులు పెన్‌గంగలో ఇటీవల సంయుక్త పరిశీలన చేపట్టారు. కలెక్టర్‌కు నివేదిక అందించాల్సి ఉంది. వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం.

– బి.వినోద్‌కుమార్‌, ఆర్డీవో, ఆదిలాబాద్‌

ఉచిత ఇసుక సాధ్యమేనా..!?1
1/1

ఉచిత ఇసుక సాధ్యమేనా..!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement