
విద్యార్థులు ఆందోళనకు గురికావద్దు
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు మానసిక ఆందోళనకు గురికావద్దని డీఈవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం పరీక్ష పర్వ్ కార్యక్రమం నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొనే ఆందోళన, ఒత్తిడి, మానసిక సమస్యలపై రిమ్స్ మానసిక వైద్య నిపుణులు ఓంప్రకాశ్, శ్రీకాంత్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యారని విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచవద్దని సూచించారు. ఎంతో మంది మేధావులు పరీక్షల్లో తప్పి ఆ తర్వాత పాసై ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఇందులో ప్రేరణాత్మక వక్త పురుషోత్తంరెడ్డి, బాలల సంరక్షణ కమిటీ సభ్యుడు, సమీరుల్లా ఖాన్, ఎంఈవో సోమయ్య, సెక్టోరియల్ అధికారి సుజాత్‌ఖాన్, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.