
● ఎస్‌హెచ్‌జీల ద్వారా అందించేందుకు కసరత్తు ● ఇళ్ల నిర్మ
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలన్నీ ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలువురు మొదలు పెట్టగా.. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో షురూ చేయలేదు. అలాంటి వారిని గుర్తించి త్వరగా ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు ఆర్థికసాయం అందించేలా యోచిస్తున్నారు. ఈ మేరకు హౌసింగ్, డీఆర్డీఏ అధి కారులు, ఎంపీడీవోలతో మంగళవారం గూ గుల్ మీట్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తదనుగుణంగా ఆయా శాఖల అధికారులు కసరత్తు ప్రారంభించారు.
భారీగా మెటీరియల్ ధరలు..
పేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒకటి చొప్పున 17 గ్రామాలను ఎంపికచేసి అర్హులైన వారి కి మంజూరు చేసింది. ఇందులో కొంత మంది ని ర్మాణాలు ప్రారంభించారు. హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్కవుట్ ప్రకారం పనులు చేపడుతున్నారు. కొంతమంది బెస్‌మెంట్ సైతం పూర్తి చేశారు. చాలా వరకు మాత్రం నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. ఇసుక, సిమెంట్, స్టీల్ ధరలు భారీగా ఉండటంతో పాటు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పనులు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. పాత ఇళ్లను తొలగించి పునాదులు తీసుకుంటే ప్రభుత్వమిచ్చే డబ్బులు ఆలస్యమైతే తమ పరిస్థితి ఏంటనే ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని గుర్తించి స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ సాయం మంజూరు చేసినట్‌లైతే పనులు ముమ్మరమై నిర్మాణాలు త్వరగా పూర్తయ్యే అవకాశముంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం జమ చేసిన డబ్బులను తిరిగి ఎస్‌హెచ్‌జీలకు అందించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నిర్ణయంపై ఇప్పటి వరకు ఇంటి నిర్మాణాలు చేపట్టని వారిలో హర్షం వ్యక్తమవుతోంది.
నాలుగు విడతల్లో ఆర్థిక సాయం
ఇందిరమ్మ లబ్ధిదారులకు నాలుగు విడతల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన రూ.5లక్షల ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదట పునాదులు పూర్తయితే రూ.లక్ష, పిల్లర్లు వేసిన తర్వాత 1.25లక్షలు, స్లాబ్ తర్వాత రూ.1.75లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష చొప్పున జమ చేయనున్నారు. ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు ఐకేపీ ద్వారా మరో రూ. లక్ష రుణం అందించనున్నారు. అయితే లబ్ధిదారు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండటంతో పాటు వారు ఉన్న సంఘం రుణానికి అర్హత కలిగి ఉన్నట్లేతేనే అందజేయనున్నారు.
తాంసి మండలం హస్నాపూర్‌లో పూర్తయిన బేస్‌మెంట్
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వివరాలు:
పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన
గ్రామాలు: 17
మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య : 2,148
మార్కవుట్ ఇచ్చినవి: 1,022
బేస్‌మెంట్ వరకు పూర్తయినవి : 118
ఇంకా ప్రారంభించనివి : 1,126
వివరాలు సేకరిస్తున్నాం
ఇందిరమ్మ ఇళ్లు మంజూరై ఆర్థికస్థోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ సైతం సూచనలు చేశా రు. తదనుగుణంగా వారి వివరాలుఅందించాలని జెడ్పీ సీఈవోకు సూచించాం. వారిచ్చే వివరాల ప్రకారం లబ్ధిదారులు ఎస్‌హెచ్‌జీల్లో ఉన్నారా.. ఆ సంఘానికి రుణం పొందే అర్హత ఉందా.. అనే వివరాలు పరిశీలించి రుణసాయం అందించేలా చర్యలు చేపడుతాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో