
‘భూభారతి’తో భూసమస్యల పరిష్కారం
● కలెక్టర్ రాజర్షిషా
బజార్‌హత్నూర్: భూభారతి చట్టంతో భూసమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల భూముల విషయంలో ఉన్న అభద్రతా భావానికి తావు లేకుండా జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ ధరణి చట్టం ప్రారంభించినప్పుడు ఆన్‌లైన్‌లో నా పట్టాభూమి మాయమైందని, మళ్లీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి నెలల సమయం పట్టిందన్నారు. ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు సామస్యులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోందన్నారు. భూభారతిలో అలా జరగకుండా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి ధరణి చట్టం తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వాలు కొత్త చట్టాలను తీసుకువస్తే వాటిని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ధరణి స్థానంలో భూభారతి పేరు మాత్రమే మార్చారని, వాటి విధి విధానాలు మాత్రం రైతులకు మేలు చేయడానికేనన్నారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, బజార్‌హత్నూర్ మండలానికి సబ్ మార్కెట్‌యార్డు మంజూరు చేయాలని రైతులు కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న యాదవ్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రైతు సమస్యల పరిష్కారానికే ‘భూభారతి’
గుడిహత్నూర్: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మన్నూరు ఎస్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సునీత, తహసీల్దార్ కవితా రెడ్డి, మన్నూరు సహకార సంఘ చైర్మన్ ప్రకాశ్‌కరాడ్, డీటీ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.