
సమావేశంలో మాట్లాడుతున్న ఐజీ శ్రీనివాసరావు
ఆరిలోవ : జైళ్ల శాఖ ఎనిమిదో జాతీయ సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్, ఏపీ జైళ్ల శాఖ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ఈనెల 11, 12 తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలు కేంద్ర కారాగారాలు, సబ్ జైళ్ల నుంచి విశాఖపట్నం కేంద్ర కారాగానికి చేరుకొన్నారు. శుక్రవారం ఈ కారాగారాన్ని సందర్శించిన రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు ఆయా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. జాతీయ సదస్సు విజయవంతంగా నిర్వహించడానికి సలహాలు సూచనలు చేశారు. సుమారు 50 మందితో నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులకు జాతీయ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఎవరు ఏఏ పనులు చేపట్టాలో గ్రూపులుగా విభజించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ జైళ్ల శాఖ ఎనిమిదో జాతీయ సదస్సు విశాఖపట్నంలో రుషికొండ దరి సాయిప్రియ రిసార్ట్స్‌లో రెండు రోజులు పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జైళ్ల శాఖ డీజీ స్థాయి ఉన్నతాధికారులు ఉమారు 140 మంది వరకు పాల్గొంటారన్నారు. వారందరికీ సాయిప్రియ రిసార్ట్స్‌తో పాటు దీనికి అందుబాటులో ఉన్న వైజాగ్ కన్వెన్షన్‌లో వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా, రాష్ట్ర హోం శాఖామంత్రి తానేటి వనిత హాజరుకానున్నారన్నారు. ముగింపు సదస్సుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నట్లు తెలిపారు. అతిథులు, అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వివిధ జైళ్లకు చెందిన 50 మంది అధికారులను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. సదస్సులో జైళ్లు శాఖలో గడిచిన 75 ఏళ్లలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకొన్నాయి, ఎలాంటి అభివృద్ధి జరిగింది, ప్రస్తుతం లాంటి అభివృద్ధి చేయాలి అన్న అంశాలపై చర్చ జరగనుందన్నారు. దీంతో పాటు ముఖ్యంగా టెక్నాలజీ ఇన్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్, స్టేటస్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇన్ ప్రిజన్స్ ఇన్ ఇండియా, మోడల్ ప్రిజన్స్ లెజిస్లేషన్‌న్, డీప్ అడిషన్ ఆఫ్ ప్రజనర్స్, ఓవర్ ప్రిజన్స్, అల్టర్నేటివ్స్ టు ఇన్‌కార్స్‌నేషన్ అనే 6 అంశాలపై చర్చిస్తారన్నారు. మన రాష్ట్రంలో జాతీయ సదస్సు నిర్వహించడం ఇది రెండోసారని ఐజీ తెలిపారు.
సదస్సులో ప్రదర్శనలు..
జాతీయ సదస్సులో రెండు రోజులు పాటు జైళ్ల ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో కేంద్ర కారాగారాలలో తయారయ్యే అన్ని రకాల ఉత్పత్తులు, జైళ్లకు సంబంధించిన ఫొటో ప్రదర్శన, అరకు కాఫీ ఉత్పత్తులు ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ‘పరివర్తన’ పేరుతో ముద్రించిన మ్యాగజైన్ ఆవిష్కరిస్తామన్నారు. జైళ్ల శాఖకు సంబంధించిన వివరాలతో కూడిన 40 పేజీల మెటీరియల్ (బుక్) సదస్సులో పాల్గొన్న అధికారులకు అందజేస్తామన్నారు.