
బడా యాత్ర... జనజాతర
● ఘనంగా మన్యం కొండ జాతర ● పొటెత్తిన భక్తులు ● వేలాదిగా తరలివచ్చిన ఒడిశా గిరిజనులు
మోతుగూడెం: ఒడిశా గిరిజనుల ఆరాధ్య దైవం మన్యంకొండ జాతర (బడా యాత్ర) ఘనంగా జరిగింది. ఒడిశా రాష్ట్రం మన్యం కొండ గ్రామం నుంచి ఆదివారం సాయంత్రం ప్రారంభమైన బడా యాత్ర ఎనిమిది కిలోమీటర్లు సాగి రాత్రికి సీలేరు నది ఆవల ఒడ్డున ఉన్న పొల్లూరు(ఒడిశా రాష్ట్రం) గ్రామానికి చేరుకుంది. అక్కడ రాత్రి బస చేసిన అనంతరం సోమవారం తెల్లవారుజామున వన దేవతలైన అన్నమరాజు, బాలరాజు,పొతు రాజులకు పూజలు చేశారు. అనంతరం అప్పటికే తయారుచేసి ఉంచిన రెండు కొత్త పడవలను కలిపి కట్టి, వాటిపై విగ్రహాలను ఉంచి ఉదయం నదిని దాటించారు. వన దేవలతో పాటు వచ్చిన వేలాది మంది ఒడిశా భక్తులు ఫ్లోటింగ్ వంతెన పై నుంచి నదిని దాటి వచ్చారు. అనంతరం ఆంధ్రా అధికారులైనా చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్, ఏఎస్పీ పంకజ్ కుమార్‌మీనా పల్లకీలో వనదేవతలను ఊరేగింపుగా పొల్లూరు (ఆంధ్రప్రదేశ్) గ్రామానికి తీసుకువచ్చి, చలువ పందిరి కింద కొలువుతీర్చారు.
మోతుగూడెం, పొల్లూరు తదితర గ్రామాలకు చెందిన వారంతా కలిసి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్న అనంతరం బడాయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర పొల్లూరు వాటర్‌ఫాల్స్ వరకూ సాగింది. అక్కడ గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, బంగారు చేప దర్శనమిచ్చినట్టు ప్రకటించిన అనంతరం వనదేవతలకు మంగళస్నానం చేయించారు. తరువాత భక్తులు కూడా ఆ పుణ్యజలాలలో స్నానాలు ఆచరించారు. అనంతరం బడా యాత్ర సీలేరు నదిని దాటి మళ్లీ ఒడిశాలోని మన్యం కొండగ్రామానికి బయలుదేరడంతో మనరాష్ట్రంలో ఈ ఉత్సవం విజయవంతంగా ముగిసింది.
వేలాదిగా వచ్చిన భక్తులకు చింతూరు పీవో అపూర్వ భరత్, ఏఎస్పీ పంకజ్ కుమార్‌మీనా ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి సదుపాయం కల్పించారు. మోతుగూడెం, పొల్లూరు గ్రామస్తులు సహకారంతో సుమారు 20 వేల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించారు. మందులు అందుబాటులో ఉంచారు. సీలేరు నదిపై నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ని భక్తులు దాటేటప్పడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒడిశా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సుమారు రెండు బోట్లతో పహారాకాశాయి.
ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో 350 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి అప్రమత్తతో వ్యవహరించారు. మన్యం కొండ జాతర బడాయాత్రలో ఒడిశా రాష్ట్రం నుంచి నవరంగపూర్ ఎంపీ బాలభద్ర మజ్జి, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడకామీ, మల్కన్‌గిరి ఐటీడీఏ పీవో దుర్యోధన బోయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పూర్తి సహాయ సహకారాలు అందించిన ఆంధ్రా అధికారులకు ఒడిశా ఎంపీ, ఎమ్మెల్యే, పీవో, ఇతర అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్‌కో అధికారులు, అటవీ, పంచాయతీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

బడా యాత్ర... జనజాతర

బడా యాత్ర... జనజాతర

బడా యాత్ర... జనజాతర
Comments
Please login to add a commentAdd a comment