మెరుగైన వైద్య సేవలందించాలి
● పీహెచ్‌సీల్లో కాన్పుల సంఖ్య పెంచండి ● ఐటీడీఏ పీవో సింహాచలం
రాజవొమ్మంగి: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు నమ్మకం కలిగేలా మెరుగైన వైద్య సేవలందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. ఆయన సోమవారం రాజవొమ్మంగి పీహెచ్‌సీను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. హాజరు రికార్డు పరిశీలించి, ఆ సమయంలో గైర్హాజరైన వారి వివరాలు పరిశీలించారు. రిజిష్టర్లు పరిశీలించి ఈ నెల కేవలం నాలుగు ప్రసవాలు మాత్రమే పీహెచ్‌సీలో జరగడంపై అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి గర్భిణుల సర్వే చేయాలన్నారు. రాజవొమ్మంగి 24 గంటల మాతా శిశు ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని మెడికల్ ఆఫీసర్ సుష్మను ఆదేశించారు. ఈ పీహెచ్‌సీలో పురుడుపోసేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నా ఎందుకు ప్రసవాల సంఖ్య పెరగడం లేదని ప్రశ్నించారు. అంతకు ముందు ఆయన స్థానిక బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు. జీసీసీ సూపర్ బజార్‌లో సరకుల విక్రయం, వాటి నిల్వలను పరిగణనలోకి తీసుకొన్నారు. స్థానిక బస్‌షెల్టర్‌లో ప్రయాణికులు నిలిచేందుకు నీడ లేదని, మరుగుదొడ్లు లేవని ఇటీవల ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినత పత్రానికి స్పందించిన ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ అంశంపై బస్‌షెల్టర్ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై స్థానిక తహసీల్దార్ సత్యనారాయణతో సంప్రదించారు.
Comments
Please login to add a commentAdd a comment