విరుగుడేది ?
ఈయన పేరు వంతాల సూరిబాబు, పెదబయలు మండలం మారుమూల కుంతుర్ల పంచాయతీ బర్రెమామిడి గ్రామం. మండల కేంద్రానికి 40 కిలోమీటర్లు, జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామానికి నేటికీ పూర్తి స్థాయిలో రహదారి, రవాణా సౌకర్యం లేదు. పెదబయలు మండలం పెదకొడాపల్లి నుంచి బంట్రోత్‌పుట్టు వరకు రహదారి అధ్వానంగా ఉంది. రహదారి బాగు చేసి, రవాణా సౌకర్యం కల్పించాలని ఈ తొమ్మిది నెలల కాలంలో ఏకంగా పదిసార్లు ఐటీడీఏలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు అందజేశారు. కానీ నేటికీ అధికారుల నుంచి కనీస స్పందన లేదు. సమస్యలు పరిష్కారం కాని ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఎన్ని ఉన్నా ఉపయోగం లేదని సూరిబాబు వాపోతున్నారు.
తిరుగుడే మిగిలింది..
అర్జీలకు లభించని
పరిష్కారం
కాళ్లరిగేలా తిరుగుతున్నా
ఫలితం శూన్యం
ఒకే సమస్యపై పలుమార్లు
విన్నవించవలసిన పరిస్థితి
పీజీఆర్‌ఎస్‌పై
సన్నగిల్లుతున్న నమ్మకం
పాడేరు : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులకు నిరాశే మిగులుస్తోంది. గతంలో పాడేరు ఐటీడీఏలో 11 మండలాలకు చెందిన ప్రజల కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేవారు. జిల్లాల విభజన తర్వాత పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రతి శుక్రవారం జిల్లా ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో అధికారుల పర్యటించిన సమయాల్లో సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నా... పరిష్కారం కాకపోవడంతో మండల స్థాయిలో ఫిర్యాదులు ఇస్తున్నారు. అక్కడ కూడా పరిష్కారం లభించకపోవడంతో ఐటీడీఏల స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో అధికారులకు అర్జీలు అందజేస్తున్నారు. కానీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలకు నిరాశే మిగులుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సుమారు తొమ్మిది నెలల కాలంలో 27,161 అర్జీలు అందాయి. జిల్లా కేంద్రమైన పాడేరులో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 మండలాలకు చెందిన ప్రజలు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్ తదితర ఉన్నతాధికారులను నేరుగా కలిసి దరఖాస్తులు అందజేస్తున్నారు. కానీ సమస్యలు సకాలంలో పరిష్కారం కావడం లేదు. దీంతో కొంతమంది తమ సమస్యలపై అధికారులు స్పందించే వరకు ఫిర్యాదులు ఇస్తూనేన్నారు. ఎన్నిసార్లు కాళ్లు అరిగేలా తిరిగినా వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు ఆర్జీదారుల నుంచి వినిపిస్తున్నాయి.
గ్రామ సమస్యలపైనే...
ప్రధానంగా గ్రామాల్లో ఉమ్మడిగా ఉన్న సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయి. తాగునీరు, రహదారుల నిర్మాణం, రవాణా సౌకర్యాలు, పాఠశాలల ఏర్పాటు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, తదితర వాటిపై అధికంగా అర్జీలు అందుతున్నాయి.
రెవెన్యూ సమస్యలే అధికం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 2,972 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో భూ సమస్యలపై ఏకంగా 20,941 అర్జీలు అందాయి. కానీ వాటిలో నేటి వరకు 25శాతం సమస్యలు కూడా పరిష్కారం కాలేదు.
129 అర్జీలు
ఐటీడీఏ సమావేశ మందిరంలో ఈ శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ దినేష్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఏకంగా 129 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రధానంగా తాగునీరు, రహదారులు, విద్యుత్, అటవీ హక్కుల పత్రాల మంజూరు, భూ సమస్యలపై అర్జీలు ఎక్కువగా అందాయి.
తొమ్మిది నెలల్లో అందిన అర్జీల వివరాలు
మొత్తం అర్జీలు 27,161
అప్‌లోడ్ చేసినవి 24,721
ప్రాసెసింగ్‌లో ఉన్నవి 1,810
రీ ఓపెన్ అయినవి 6,30
విరుగుడేది ?
విరుగుడేది ?
విరుగుడేది ?
Comments
Please login to add a commentAdd a comment