ఆర్థిక తగాదాలతో తమ్ముడిని హత్యచేసిన అన్న
మారేడుమిల్లి: ఆర్థికలాదాదేవీల్లో ఏర్పడిన తగాదాల కారణంగా సొంత తమ్ముడిని ఓ అన్న హత్యచేశాడు. ఎస్‌ఐ సాధిక్ తెలిపిన వివరాలు.. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ పరిధిలోని నీలవరం గ్రామానికి చెందిన తుమ్ముడు సుగ్గిరెడ్డి (40), తుమ్మడు లచ్చిరెడ్డి అన్నదమ్ములు. వీరు 2002 సంవత్సరంలో ఉమ్మడిగా ఓ వ్యాన్‌ను కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ వ్యాన్ ప్రమాదానికి గురైంది. వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో ఇద్దరికీ నష్టం వచ్చింది. నష్టాన్ని ఇద్దరూ సమానంగా భరించాలని ఒప్పంద కుదుర్చుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలపై తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సుగ్గిరెడ్డి, లచ్చిరెడ్డి గ్రామ సమీపంలోని జీలుగు కల్లు చెట్టు వద్దకు వెళ్లి కల్లు తాగారు. ఈ సమయంలో వారి మధ్య ఆర్థిక లావాదేవీలపై మళ్లీ గొడవ జరిగింది. అనంతరం ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. కొంత సమయం తరువాత సుగ్గిరెడ్డిని అన్నయ్య లచ్చిరెడ్డి జీలుగు కల్లు చెట్టు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ బాణంతో సుగ్గిరెడ్డిని కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సుగ్గిరెడ్డి మృతి చెందాడు. ఈ విషయం సోమవారం పోలీసులకు తెలిసింది. సీఐ గోపాల్ కృష్ణ, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్‌ఐలు సాధిక్, పార్ధసారథి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి, నిందితుడు లచ్చిరెడ్డిని అరెస్టు చేశారు. పోస్టుమార్టానికి సుగ్గిరెడ్డి మృతదేహాన్ని రంపచోడదవరం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఎస్‌ఐ సాధిక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment