మద్యం.. తీసింది ప్రాణం
భవనంపై నుంచి జారిపడి తెలంగాణ వాసి మృతి
కొమ్మాది: జీవీఎంసీ 8వ వార్డు రుషికొండ ప్రాంతంలోని భవనంపై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలివి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లికి చెందిన తవిడిబోయిన సతీష్ (35) భవన నిర్మాణాల్లో గ్రానైట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన పది మంది బృందంగా ఏర్పడి రుషికొండకు వలస వచ్చారు. ఈ నెల 23న రుషికొండ స్వర్ణభారతి నగర్‌లో ఓ భవనం 4వ అంతస్తుపై ఇల్లు అద్దెకు తీసుకుని దిగారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గ్రానైట్ పనులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా.. వీరంతా బుధవారం రాత్రి గది బయట బాల్కనీలో మద్యం సేవించారు. రేచీకటి సమస్య ఉన్న సతీష్ మద్యం మత్తులో అర్ధరాత్రి 12 గంటలకు భవనం గోడ వద్దకు వెళ్లి.. ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సహచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.