
పదోన్నతుల ‘పంచాయితీ’!
మహారాణిపేట: జిల్లా పంచాయతీ ఉద్యోగుల పదోన్నతుల పంచాయితీ ఆరోపణలకు తావిస్తోంది. ముడుపులు చెల్లిస్తే తప్ప.. ఫైల్ ముందుకు కదలదని ఉద్యోగులు గుసగుసలుపోతున్నారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులకు ఎట్టకేలకు అవకాశం వచ్చినప్పటికీ.. సిబ్బంది మామూళ్ల వ్యవహారంతో ఫైల్ ఇంకా జిల్లా పంచాయతీ కార్యాలయం(డీపీవో)లోనే మూలుగుతోంది. ఈ పదోన్నతులను ఆదాయ వనరుగా మార్చుకోవాలనే కొందరి అత్యాశే ఈ ఫైల్ తొక్కిపెట్టేందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎంపీడీవోలు ఫైళ్లు పంపించినా..
పంచాయతీరాజ్‌లో పదోన్నతులు కల్పించే విషయంలో సీనియార్టీ జాబితాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు(ఎంపీడీవో) తయారుచేసి డీపీవోకు పంపాలి. ఈ ప్రకారం జిల్లాలో 32 మందిని అర్హులుగా పేర్కొంటూ జాబితాను డీపీవో కార్యాలయానికి ఎంపీడీవోలు పంపారు. కానీ ఇక్కడ డీపీవో కార్యాలయం నుంచి ఈ జాబితా పంపేందుకు కొందరు బేరసారాలకు దిగుతున్నారన్న ఆరోపణలున్నాయి. పైసలు ఇస్తేనే ఫైల్ పంపుతామని, లేకపోతే పదోన్నతులుండవని తేల్చిచెప్తున్నారట. అందుకే ఈ ఫైల్ ఇంకా విశాఖను దాటలేదని సమాచారం.
ఆ ఒక్కడే కారణం?
ఆరోపణలపై పాడేరు నుంచి విశాఖ డీపీవో కార్యాలయానికి వచ్చిన ఓ ఉద్యోగి వల్లే పదోన్నతుల్లో తాత్సారం జరుగుతోందని సమాచారం. ఈ ఉద్యోగికి డీపీవో కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఫైల్ కూడా అతని వద్దే ఉంది. డబ్బులిస్తే తప్ప, ఫైల్‌ను పంపించేది లేదని చెప్తున్నాడట. అధికారుల అండతోనే ఇలా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో 32 మంది ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. దీనిపై డీపీవో శ్రీనివాసరావును వివరణ కోరగా.. పూర్తి స్థాయి వివరాలు రాకపోవడంతో జాబితా సిద్ధం కాలేదన్నారు. కొంత మంది ఎంపీడీవోలు ఈ నెల 26న జాబితాలను పంపారని, మరి కొందరు పంపించాల్సి ఉందన్నారు. అన్ని వివరాలతో ఫైల్ తయారు చేసి, త్వరలోనే పైకి పంపించనున్నట్లు పేర్కొన్నారు.
సందిగ్ధంలో 32 మంది పదోన్నతులు
రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులకు ఈ నెల 21 నాటికే డీపీవో నుంచి ఫైల్ అమరావతిలో ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లాలి. కానీ ఇప్పటి వరకు జాబితా వెళ్లకపోవడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. మొత్తం 32 మందికి పంచాయతీ కార్యనిర్వహణాధికారి అండ్ రూరల్ డెవలప్‌మెంట్(ఈవోఆర్డీ)గా పదోన్నతులు అందించే ఫైల్.. విశాఖలోని డీపీవో కార్యాలయంలోనే ఇంకా ఉంది. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పదోన్నతుల ఫైళ్లు అమరావతికి చేరాయి. విశాఖలో మాత్రం ఫైల్‌కు ఇంకా తుది మెరుగులు దిద్దుతూనే ఉన్నారు..!
ఉద్యోగుల పదోన్నతుల్లో తాత్సారం చేస్తున్న డీపీవో
ఈ నెల 21కే వెళ్లాల్సిన ఫైల్..
ఇంకా డీపీవో ఆఫీస్‌లోనే..
చక్రం తిప్పుతున్న సిబ్బంది..
ఆందోళనలో ఉద్యోగులు