సాక్షి, విశాఖపట్నం : సముద్రాన్ని పరిరక్షిస్తూ.. మత్స్య సంపదతో పాటు జీవవైవిధ్యాన్ని కాపాడుతోంది మత్స్యకారులేనని ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఐ) వైజాగ్ జోన్ డైరెక్టర్ భామిరెడ్డి అన్నారు. ఎఫ్‌ఎస్‌ఐ విశాఖ కార్యాలయాన్ని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మైరెన్ మ్యూజియంలో సముద్ర జీవజాలాన్ని ఆసక్తిగా తిలకించారు. జోన్ డైరెక్టర్ భామిరెడ్డి.. వీరితో ముఖాముఖి మాట్లాడుతూ సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతుండటంతో సముద్ర వాతావరణానికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యర్థాల్ని తొలగించే బాధ్యతపై అవగాహన కల్పిస్తూ ఎఫ్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా ఘోస్ట్ ఫిషింగ్ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 400 నాటికల్ మైళ్ల దూరంలో నౌకలు సర్వే చేసినప్పుడు దొరికిన వలల వ్యర్థాలు చేస్తున్న కీడుకి సంబంధించిన వీడియోల్ని మత్స్యకారులకు చూపిస్తూ.. చైతన్యవంతుల్ని చేస్తున్నామని వివరించారు. తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్షితులై.. కొందరు మత్స్యకారులు సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడుకునే బాధ్యతని తమ భుజస్కందాలపైకి ఎత్తుకున్నారని తెలిపారు. మత్స్యకారులతో పాటు.. సందర్శకులు, సామాన్య పౌరులు కూడా సముద్రాలు కాలుష్యం కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఐ శాస్త్రవేత్త జీవీఎ ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎఫ్‌ఎస్‌ఐ విశాఖ జోన్ డైరెక్టర్ భామిరెడ్డి