రైలు నుంచి జారిపడి వలస కార్మికుడు మృతి
రాజవొమ్మంగి: పొట్టచేత పట్టుకొని వలస వెళ్లి, తిరిగి స్వగ్రామం వస్తున్న క్రమంలో మండలంలోని బడదనాంపల్లి గ్రామానికి చెందిన పాశిలి మురళీకృష్ణ(23) రైలు నుంచి జారి పడి సోమవారం మరణించాడు. మురళీకృష్ణ నెల్లూరు జిల్లా శివారు ప్రాంతాలకు కొంత మందితో కలసి ఉపాధి కోసం వెళ్లాడు. తిరిగి అక్కడ నుంచి స్వగ్రామం వస్తుండగా మార్గమధ్యలో గూడూరు వద్ద రైలు నుంచి జారి పడినట్టు తోటి కూలీలు తెలిపారు. మురళీకృష్ణ సంఘటన స్థలంలో మృతి చెందగా, మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామం తరలించి అంత్యక్రియలు జరిపారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గంగరాజు, నారాయణమ్మలు భోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరు ఇంటర్మీడియెట్ వరకు చదివారు. చిన్న కుమారుడు మురళీకృష్ణ రైలు ప్రమాదంలో మరణించాడు.