నూకాలమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

నూకాలమ్మ జాతర

Published Wed, Mar 26 2025 1:41 AM | Last Updated on Wed, Mar 26 2025 1:37 AM

పోదాం పదే యాతర
భక్తులకు మూలవిరాట్‌ దర్శనం లేనట్టే..

అనకాపల్లి టౌన్‌: ఉత్తరాంధ్రలోనే ప్రఖ్యాతి గాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 28, 29 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది. 28న జాతర, 29న కొత్త అమావాస్య పండగ, 30న ఉగాది వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల రోజులపాటు జరగనున్న జాతర ఏప్రిల్‌ 27వ తేదీతో ముగుస్తుంది. అమ్మవారు కొలువై ఉన్న బాలాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేసవి కావడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లను సిద్ధం చేశారు. మంచినీటి కూలర్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్‌ గొల్లబాబు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను నిరంతరం పరిశీలిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో మరింత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ఆలయ పరిసరాల్లోనే ఈ పండగ వాతావరణం కనిపించేది. ఈసారి పట్టణం నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్‌ స్టేడియంలో కూడా ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాగణంలో భారీ వేదిక రూపొందించి భక్తులందరికీ కనిపించేలా అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. ఈ అమ్మవారి విగ్రహానికి రెండు పూటలా ప్రత్యేక పూజలు చేయడానికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్టేడియం పరిసరాలను పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతున్నారు. జెయింట్‌వీల్‌, మూవింగ్‌ ట్రైన్‌, రన్నింగ్‌ షిప్‌, పిల్లలు ఆడుకొనే వివిధ రకాల వస్తువులు, తినుబండారాల స్టాల్స్‌ నెలకొల్పనున్నారు. ఆధ్యాత్మికత ప్రతిఫలించేలా సంకీర్తనలు, కోలాటం, జానపద నృత్యాలను నెల రోజులపాటు నిర్వహించనున్నారు. నెల రోజుల జాతర కోసం ఎన్టీఆర్‌ స్టేడియంలో నెలకొల్పే 12 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం గవరపాలెం పురవీధుల గుండా ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు.

నెల రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు

రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ

అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణ పనులు గడిచిన రెండేళ్లుగా నిర్విరామంగా చురుగ్గా సాగుతున్నాయి. మధురైలోఉన్న మీనాక్షి అమ్మవారి గుడి తరహాలో నిర్మాణం చేపడుతున్నారు. సుమారు రూ.10 కోట్ల నిధులతో ఆలయం ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. గతంలో ఒకవైపు ప్రధాన గోపురం ఉండేది. ఇప్పుడు మిగిలిన మూడు వైపులా రాజగోపురాలు, అంతరాలయం, అలివేటి మండపం నిర్మిస్తున్నారు. అన్ని హంగులు పూర్తయ్యాక దసరాకు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో గర్భాలయంలో అమ్మవారి మూలవిరాట్‌ దర్శనం ఈ ఏడాది కూడా లేనట్టయింది. ఈ నేపథ్యంలో భక్తులు బాలాలయంలోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

నూకాలమ్మ జాతర1
1/2

నూకాలమ్మ జాతర

నూకాలమ్మ జాతర2
2/2

నూకాలమ్మ జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement