
గిరిజన విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం
అరకులోయ టౌన్: గిరిజన విద్యార్థులు ఎందులోను తీసుపోరని, ఐదు నెలల పాటు సాధన చేసి, వరల్డ్ రికార్డు కోసం సూర్యనమస్కారాలు ప్రదర్శించడం అద్భుతమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో గిరిజన విద్యార్థులతో నిర్వహించిన మహా సూర్యవందన్ కార్యక్రమాన్ని సోమవారం జ్యోతిప్రజ్వలనతో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఐదు నెలలుగా 21 వేల మంది విద్యార్థులు 108 సూర్యనమస్కారాలను సాధనం చేసి ప్రపంచ రికార్డు లక్ష్యంగా కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. 21,850 మంది విద్యార్థులు ఇందులో పాల్గొనగా వారిలో 13 వేల మంది బాలికలు ఉండడం విశేషమన్నారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ గత ఐదు నెలల నుంచి ఉదయం 4 గంటలకు నిద్రలేపి విద్యార్థులతో సాధన చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి శ్రీనివాస్‌తో పాటు అన్ని పాఠశాల పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
ప్రపంచ రికార్డు నమోదు: పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 108 సూర్యనమస్కారాల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. 21,850 మంది విద్యార్థులు ఈ మహా సూర్యవందన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లండన్‌కు చెందిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలిస్ రేనాడ్ ఈ ప్రదర్శనను క్షుణ్ణంగా పరిశీలించి హర్షం వ్యక్తం చేసి, వరల్డ్ రికార్డు సాధించినట్లు ప్రకటించారు. అనంతరం కలెక్టర్ దినేష్‌కుమార్‌కు, అధికారులకు ఈవరల్డ్ రికార్డు ప్రతిని ఆమె అందజేశారు. ఈ సందర్భంగా అలిస్ రేనాడ్‌తో పాటు పతంజలి శ్రీనివాస్‌లను కలెక్టర్ దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.
గిరిజన సంక్షేమశాఖ మంత్రి
గుమ్మడి సంధ్యారాణి

గిరిజన విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం