
అక్రమ నిర్మాణాలకు సహకరించొద్దు
అరకులోయటౌన్: అరకులోయలో రోజురోజుకు అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, దీనిపై గిరిజనేతరుల పెత్తనం పెరుగుతోందని, అటువంటి వారిని ఎవరూ ప్రోత్సహించొద్దని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెవెన్యూ అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీపీ రంజపల్లి ఉషారాణి అధ్యక్షతన బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మత్స్యలింగం పాల్గొని మాట్లాడారు. పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతున్న అరకులో గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రోత్సహించొద్దన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని, అక్రమ నిర్మాణాల అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి ఫారెస్టు శాఖ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయని, సమస్య పరిష్కారానికి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్‌కు కోరామన్నారు. ఫుట్‌పాత్‌లో వ్యాపారాలు చేయడం వల్ల పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, వ్యాపారాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
జల్‌జీవన్ మిష్‌న్ నిధుల దుర్వినియోగంపై ధ్వజం
మండలంలోని గిరి గ్రామాలల్లో తాగునీటి కల్పనకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జల్‌జీవన్ పథకం నిధుల దుర్వినియోగంపై ఎంపీటీసీ సభ్యులు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను నిలదీశారు. ఏ గ్రామంలో కూడా పూర్తిస్థాయి పనులు జరగలేదని, పాత నిర్మాణాలను చూపి బిల్లులు మార్చుకున్నారని ఆరోపించారు. అరకులోయ పట్టణంలో గత నెల రోజులుగా కొళాయిల ద్వారా నీటి సరఫరా చేయడం లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభాలు, సంక్షేమ పథకాల ప్రారంభానికి తమకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతల చేత భూమి పూజలు చేయిస్తూ, తమను అవమానపరుస్తున్నారని ఎంపీటీసీలు దురియా ఆనంద్‌కుమార్, ఎల్.బి.భీమరాజు, శత్రుఘ్న, స్వాభి రామ్మూర్తి, సర్పంచ్ రమేష్, చినబాబు, దురియా భాస్కర్‌రావు, బుటికి, ఎం. జ్యోతి, సుశ్మిత, భూర్జ బొజ్జ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశాారు. దీనిపై అధికారులను నిలదీశారు. దీనిపై ఎంపీపీ రంజపల్లి ఉషారాణి స్పందించి మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో రహదారులను త్వరితగతిన నిర్మించాలని సూచించారు. ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా వైద్య సేవలందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైస్ ఎంపీపీ కిల్లో రామన్న చెప్పారు. తహసీల్దార్ ఎం.వి.వి. ప్రసాద్ మాట్లాడుతూ పంచాయతీ అధికారులు గిరిజనేతరులకు ఎన్‌వోసీలు ఇవ్వవద్దని, ఇంటి పన్ను కట్టించుకోవద్దన్నారు. అరకులోయలో చొంపి రహదారిలో అక్రమ నిర్మాణదారుడిపై ఎల్‌టీఆర్ కేసు నమోదు చేశామన్నారు. అదే విధంగా తహసీల్దార్ క్వార్టర్స్ పక్కన అక్రమంగా షాపు నిర్మాణదారుడిపై ఎల్‌టీఆర్ కేసు నమోదు చేస్తామన్నారు. ఎంపీడీవో అడపా లవరాజు, ఎంఈఓ త్రినాథరావు, వెలుగు ఏపీఎం కృష్ణారావు, సిడీపీవో శారద, ఎకై ్సజ్ సీఐ సంతోష్, ఇంజినీరింగ్ ఏఈఈలు అభిషేక్, గోపికృష్ణ, క్రాంతి, మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అక్రమ నిర్మాణాలకు సహకరించొద్దు

అక్రమ నిర్మాణాలకు సహకరించొద్దు