
షిప్‌యార్డ్‌లో నిచ్చెన పైనుంచి పడి కార్మికుడి మృతి
మల్కాపురం: షిప్‌యార్డ్‌లో నిచ్చెనపై నుంచి కింద పడిన సొసైటీ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలివి.. గాజువాక ఆర్టీసీ డిపో సమీపంలోని పాత చెక్‌పోస్ట్ ఏరియాలో పిలక అప్పారావు(56) అలియాస్ అప్పారావు రెడ్డి తన భార్య, కుమారుడు, కుమార్తెతో నివాసం ఉంటున్నాడు. పిలక అప్పారావు షిప్‌యార్డ్‌లో మాజీ సొసైటీ కార్మికుడిగా 30 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు. షిప్‌యార్డ్ హాల్‌షాప్ డిపార్ట్‌మెంట్ వద్ద బుధవారం ఉదయం 8.30గంటల సమయంలో ఈవోటీ క్రేన్‌పైకి వెళ్లేందుకు నిచ్చెన ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడి నుంచి అదుపు తప్పి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని తోటి కార్మికులు సంస్థ ఆవరణలోని ఆసుపత్రి వద్దకు తొలుత తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా మారడంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందారు. కాగా.. తమకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. పోలీసులు, యూనియన్ ప్రతినిధులు కలుగజేసుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.