
సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి
చింతపల్లి: గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవాలని అరకు ఎంపీ తనూజారాణి అన్నారు. శుక్రవారం చింతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అనూషాదేవి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్యసమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మాట్లాడుతూ మండల కేంద్రం సహా మండలంలోని 17 పంచాయతీల్లోనూ పలు గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, పరిష్కరించాలని కోరారు. తాగునీటి సరఫరా విభాగం ఏఈఈ సర్ణలత మాట్లాడుతూ మండల కేంద్రానికి రూ.22 కోట్లతో తాగునీటి పథకం మంజూరైనట్టు చెప్పారు. త్వరలో ప్రాజెక్టు పనులు మొదలవుతాయన్నారు. ఎర్రబొమ్మలు, తమ్మంగుల, తాజంగి, కొమ్మంగి, పంచాయతీల్లో సమస్యల గురించి ఆయా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు వివరించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు బోడంనాయుడు, లోకేష్‌కుమార్, వెంకటేష్, ఐసీడీఎస్ సీడీపీవో రమణి,గృహనిర్మాణశాఖ ఏఈ రమణబాబు,బాలకిషోర్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
చింతపల్లి మండల సర్వసభ్య సమావేశంలో అరకు ఎంపీ తనూజా రాణి