
అప్పన్నకు శ్రీ పుష్పయాగం
● ముగిసిన వార్షిక కల్యాణోత్సవాలు
సింహాచలం: సింహగిరిపై గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం నుంచి స్వామికి శ్రీ పుష్పయాగాన్ని నిర్వహించారు. స్వామి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవి అమ్మవార్లకు పూల అలంకరణ చేసి ఆలయ కల్యాణమండపంలో శేషతల్పంపై ఆళ్వారులతో సహా వేంజేపచేసి విష్వక్సేణపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. ద్వాదశి ఆరాధనలు, పలు రకాల పుష్పాలతో పుష్పాంజలి సేవ చేశారు. అనంతరం భోగమండపంలో ఉంజల్‌సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ సేవ నిర్వహించారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.