
28 నుంచి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె
పెదబయలు: తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్టు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సహాయకుల (ఫీల్డ్ అసిస్టెంట్ల) సంఘం నాయకులు కూడ రాజారావు, కొండలరావు తెలిపారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఈవోపీఆర్‌డీ నర్సింగరావుకు వారు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2016 నుంచి 2025 సంవత్సరం వరకు 9 ఏళ్ల పాటు ఒక్క వేతనం రూపాయి కూడా పెంచలేదని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజన ప్రాంతంలో పర్యటించడంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కనీస వేతనాల పెంపు విషయం ప్రస్తావిస్తారని భావించామని, నిరాశే ఎదురైందని వారు చెప్పారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, భౌతికదాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, మండల యూనిట్‌గా అంతర్గత బదిలీలు చేయడం ద్వారా స్థానిక ఒత్తిడులను అధిగమించి సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, మరణ పరిహారం రూ.10 లక్షలు ఇవ్వాలని, విద్యార్హత ఆధారంగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పది రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని తెలిపారు. ఈ నెల 21న పెన్ డౌన్ చేస్తామని, 28వ తేదీ నుంచి పూర్తిగా విధులను బహిష్కరిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతా కొండలరావు, ప్రసాదరావు, సుశీల, పార్వతి, బాలన్న, తదితరులు పాల్గొన్నారు.
ఈవోపీఆర్‌డీకి నోటీసు అందజేత
వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్