
టీడీపీలో అరాచకాలకు పాల్పడుతున్న నేతలకు అడ్డుకట్ట వేయాలి
ముంచంగిపుట్టు: మండలంలో తెలుగుదేశం పార్టీలో అరాచకాలకు పాల్పడుతున్న నాయకులకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు కోరారు. మండల కేంద్రం ముంచంగిపుట్టలో శనివారం టీడీపీ మండల నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కొంతమంది టీడీపీ నేతల వల్ల జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయకుండా తిరోగమన చర్యలకు పాల్పడుతున్న నాయకులపై అధిష్టానం దృష్టి పెట్టి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలో అందరినీ ఏకం చేయడంలో విఫలం అవుతున్న అసమర్థులను పదవుల నుంచి నుంచి తొలగించి, పార్టీ కోసం కష్టపడిన వారికి బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జులుగా, కుటుంబ సాధికార సారథులుగా నియమించాలని, గ్రామ కమిటీల్లో స్థానం కల్పించాలన్నారు. పార్టీలో నాయకుల తీరు మారకపోతే చాలా మంది నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. స్వార్థపూరిత రాజకీయ నాయకుల వల్ల టీడీపీకి భారీ నష్టం తప్పదన్నారు.అసమర్థ నాయకుల స్వార్థ ప్రయోజనాలతో నిస్వార్థమైన నేతలు, కార్యకర్తలు బలైపోతున్నారని తెలిపారు. తక్షణమే పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి పార్టీలో అసమర్థులను వారి స్థానాల నుంచి తొలగించాలని,లేని పక్షాన పార్టీకి భారీ సంఖ్యలో నేతలు,కార్యకర్తలు దూరమవతారని శాస్త్రిబాబుతో పాటు టీడీపీ నేతలు,కార్యకర్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ఆర్.నీలకంఠం పాత్రో, పార్టీ సీనియర్ నేతలు సుబ్రహ్మణ్యం,రఘునాఽథ్,రామదాసు,చిరంజీవి,పరుశురాం తదితరులు పాల్గొన్నారు.
అరకు పార్లమెంట్
ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు
అధిష్టానం దృష్టి పెట్టాలని డిమాండ్