
రేపే అప్పన్న చందనోత్సవం
సింహాచలం : వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని సంవత్సరమంతా చందనం మణుగుల్లో నిత్యరూపంలో దర్శనమిచ్చే సింహాద్రినాథుడి నిజరూప దర్శనం లభించే సమయం ఆసన్నమైంది. సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం బుధవారం జరగనుంది. ఏడాదిలో కేవలం ఒక్క రోజులోని కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు తరలిరానున్నారు. ఈసారి 2 లక్షల మంది భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుంటారని అంచనా వేశారు. సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తూ.. వారికి దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
వెండిబొరుగులతో చందనం ఒలుపు
చందనోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమా లు ప్రారంభిస్తారు. సుప్రభాతసేవ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేస్తా రు. అనంతరం వెండిబొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని తీసి నిజరూపభరితుడిని చేస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజుకి తొలిదర్శనం కల్పిస్తా రు. 3.30గంటల నుంచి రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించే రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించేవారికి, ప్రముఖులకు దర్శనం కల్పిస్తారు. ఉదయం 6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తిచేస్తారు.
ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనం
ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభిస్తారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000 టికెట్లు క్యూల్లో ఉన్న వారందరికీ దర్శనాలు ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలలోపే సింహగిరిపై దర్శనాల క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఖాళీ బస్సులను కొండపైకి పంపించి కొండపై ఉనన భక్తులను కొండదిగువకి చేరుస్తారు. 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా భక్తులను కొండపైకి అనుమతించరు.
తెల్లవారుజామున 3.30 గంటల
నుంచి సర్వదర్శనం ప్రారంభం
సాయంత్రం 6 గంటల తర్వాత
సింహగిరిపైకి అనుమతి లేదు
రాత్రి 7 గంటలకు సింహగిరిపై
క్యూల ప్రవేశ గేట్లు మూసివేత
ప్రొటోకాల్ వీఐపీలకు ఉదయం
6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తి
ఆ తర్వాత అందరికీ నీలాద్రిగుమ్మం నుంచే లఘు దర్శనం
2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
సామాన్య భక్తులకే పెద్దపీట
బీచ్‌రోడ్డు(విశాఖ): చందనోత్సవంలో సాధారణ భక్తుల దర్శనానికి తొలి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండపైన, కింద నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న ఆర్టీసీ బస్సులను మాత్రమే నడపాలని ఆదేశించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా విక్రయించే టికెట్లపై సీరియల్ నంబర్, స్కానింగ్, క్యూలను సూచించే బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సింహాచలం ప్రాంతంలోని మద్యం షాపులను మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ముసివేయాలని అధికారులకు ఆదేశించారు.

రేపే అప్పన్న చందనోత్సవం

రేపే అప్పన్న చందనోత్సవం