ఏయూ తెలుగు విభాగం
ఏయూ క్యాంపస్: భాష భావాలకు వారధి. భావాలను పలకించడం అమ్మ నుంచి అలవడుతుంది. అమ్మ నుంచి అబ్బిన భాష మనకు ఆధారంగా మారుతుంది. అమ్మ తొలి పలుకు బిడ్డలో ఆలోచనాశక్తికి ఆలంబనగా నిలుస్తూ పరిసరాలపై అవగాహన పెంచుతుంది. సమాజంపై అవగాహన పెంచడానికి, అనుబంధం పెనవేయడానికి అమ్మభాష ఉపకరిస్తుంది. ప్రపంచ భాషల్లో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న మన మాతృభాష తెలుగు.
తెలుగు వారి ఆస్తి గిడుగు
వాడుక భాష వ్యావహారిక భాష కావాలని పరితపించి, పోరాడి సాధించిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు, అందరికీ తెలుగు భాషను చేరువ చేయాలనే లక్ష్యంతో వ్యవహారిక తెలుగును వాడుకలోకి తెచ్చిన తొలి వ్యక్తి రామ్మూర్తి పంతులు. ఆయన జయంతి (ఆగస్టు 29)ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఆయన 1893 ఆగస్టు 29న పర్వతాలపేటలో జన్మించారు. గురజాడ వేంకట అప్పారావుకు సమకాలీకుడు గిడుగు. బీఏ పట్టా పుచ్చుకునే వరకు ఇద్దరూ కలిసి చదువుకున్నారు. సవరభాషపై ఉన్న ఆసక్తితో ఆ భాషను సైతం గిడుగు రామ్మూర్తి పంతులు నేర్చుకున్నారు.
తొలి విభాగం
భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రవిశ్వవిద్యాలయం తొలుత కేవలం నాలుగు కోర్సులతో మాత్రమే ఆరంభమైంది. 1926లో ప్రారంభమైన ఏయూలో తెలుగు, చరిత్ర, అర్ధశాస్త్రం, రాజనీతిశాస్త్రం కోర్సులను ప్రారంభించారు. తెలుగు భాషకు ప్రాధాన్యత కల్పిస్తూ తొలి ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్రవిశ్వవిద్యాలయానికి కాస్త భిన్నంగా ఆంధ్ర విశ్వకళా పరిషత్ అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగా తరువాత కాలంలో సంగీతం, నృత్యం, నాటకం వంటి కళలను సైతం దీనిలో భాగం చేశారు. నేటి పాలకులు మరింత ముందుచూపుతో ఆలోచన చేస్తూ డిజిటల్ రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసి, ఆడియో ఇంజినీరింగ్, ఫిల్మ్ ఎడిటింగ్ వంటి కోర్సులను అందిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు తెలుగు విభాగం విరాజిల్లుతోంది. ప్రస్తుత ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి ఇటీవల ఎయిడెడ్ కళాశాలల నుంచి అధ్యాపకులను తీసుకువచ్చి తెలుగు విభాగానికి పూర్వ వైభవాన్ని, జవసత్వాలను అందించారు.
ఏయూకు పుస్తకాలు బహూకరించారు
గిడుగు రామ్మూర్తి పంతులు తాను సేకరించిన, చదివిన అనేక పుస్తకాలను ఏయూలోని డాక్టర్ వీఎస్ కృష్ణ గ్రంథాలయానికి బహూకరించారు. నేటికీ ఈ పుస్తకాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. పద్మకాదంబరి, కుమారకంఠము, బాలదేవీభాగవతము, పార్వతీ పరిణయం, గిరిక పెండ్లి, భజనానంద తరంగిణి, మేజువాణీ, పెద్దాపుర సంస్థాన చరిత్రము, నాట్యోత్పలము, మాతృదేశ సంకీర్తనము, మణిమేఖల వంటి పుస్తకాలు ఏయూ గ్రంథాలయంలో భద్రపరిచారు. స్వాతంత్య్రానికి పూర్వం ముద్రించిన అనేక పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment