
అధ్యాపకుడు రామారావుకు జమ్మూ వర్సిటీ పురస్కారం
యలమంచిలి రూరల్ : స్థానిక గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి రేఖా రామారావుకు జమ్మూ యూనివర్సిటీ పురస్కారం అందించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ పి.చంద్రశేఖర్, పలు విభాగాల హెచ్‌వోడీలు శనివారం అభినందించారు. ఇటీవల అధ్యాపకుడు రామారావుకు జమ్మూ యూనివర్సిటీ నుంచి సావిత్రీబాయి పూలే అంతర్ రాష్ట్రీయ శిక్షక్ అచీవర్స్ అవార్డు ప్రదానం చేసింది. 36 సంవత్సరాలుగా బోధనా రంగంలో విద్యార్థులకు, పలు కళాశాలలకు అంకిత భావంతో సేవలందించినందుకు ఈ పురస్కారం లభించిందని పలువురు ఆయన సేవలను కొనియాడారు. గతంలో రామారావు ఏజెన్సీ ప్రాంతంలో 14 సంవత్సరాలు పనిచేశారు. విశాఖపట్నం డాక్టర్ వీఎస్ కృష్ణాకాలేజీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్‌గా, ఆంధ్ర విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్రం బోర్డ్ ఆఫ్ స్టడీస్ డైరెక్టర్‌గా, ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల డీఆర్సీగా ఆయన విలువైన సేవలందించారని వక్తలు ప్రస్తావించారు. ఈ మేరకు శనివారం రామారావును పలువురు విద్యార్థులు, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ వై.పోలిరెడ్డి పాల్గొన్నారు.