14 నుంచి ఉత్తరాంధ్ర స్థాయిలో మెగా పాల పోటీలు
నర్సీపట్నం : ఉత్తరాంధ్ర పాడి పశువుల మెగా పాల పోటీలను విజయవంతం చేయాలని పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్.నరసింహులు వైద్యులకు సూచించారు. నర్సీపట్నం ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, పశువైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక పాల దిగుబడినిచ్చే మేలు జాతి పశువుల పెంపకంపై ఆసక్తి పెంచడానికి శాసీ్త్రయ పోషణ, యాజమాన్య పద్ధతుల ద్వారా రైతుల్లో పోటీతత్వం పెంపొందించడానికి ప్రభుత్వం ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఉత్తరాంధ్ర స్థాయి మెగా పాల పోటీలను విజయనగరం జిల్లా తోటపాలెంలో నిర్వహిస్తుందన్నారు. ముర్రాజాతి గేదెలు, స్వదేశీ ఆవులు, విదేశీ సంకరజాతి ఆవులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.40 వేలు, మూడో బహుమతి రూ.25 వేలుగా నిర్ణయించారన్నారు. అక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడడానికి రెండు రోజుల ముందు 12వ తేదీ నుంచి పశువులను అక్కడికి అనుమతిస్తారన్నారు. రెండు రోజుల పాటు నిపుణులతో పశుపోషణలో మెలకువలు, ముఖాముఖీ సదస్సులు నిర్వహిస్తామన్నారు. స్టీల్ క్యాన్, ప్లాస్టిక్ తొట్టి, పశువులకు అవసరమైన ఇతర సామాగ్రి, ఆరు రోజులకు సరిపడా మేత, నీరు, దాణా, సర్టిఫికేట్, మెమెంటోతో పాటు ఒక్కో పశువుతో వచ్చే ఇద్దరు మనుషులకు ఉచితంగా రవాణా, వసతి, భోజనం సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి గల రైతులు సమీపంలోని రైతు సేవ కేంద్రం వద్ద వివరాలు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment