అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
సీడీపీవో, సూపర్‌వైజర్ వేధింపులే కారణమని ఆరోపణ
కె.కోటపాడు: పోతనవలస అంగన్‌వాడీ కార్యకర్త రొంగలి నూకరత్నం బుధవారం చీమలమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. పొలానికి వెళ్లిన భర్త నాయుడు ఇంటికి తిరిగి వచ్చే సరికి ఆమె అపస్మారక స్ధితిలో ఉన్నారు. పక్కనే నీటిలో చీమల మందు కలి పి ఉన్న గ్లాస్ ఉండడంతో ఆయన చూసి ఆందోళన చెందాడు. దీంతో భార్యను ఆటోలో కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. అవసరమైన వైద్యం అందించామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని సీహెచ్‌సీ వైద్యాధికారి ప్రశాంత్ తెలిపారు.
శ్రుతి మించిన వేధింపులు
కె.కోటపాడు సీడీపీవో మంగతాయారు, సూపర్‌వైజర్లు రాములమ్మ, కల్యాణి తిట్టడం వల్లనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్టు అంగన్‌వాడీ కార్యకర్త నూకరత్నం తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ఈ నెల 1న అంగన్‌వాడీ కేంద్రం విజిట్‌కు వచ్చిన సీడీపీవో మంగతాయారు, సూపర్‌వైజర్ రాములమ్మలు తనను తిట్టి, సెంటర్ రికార్డులు కె.కోటపాడు ఆఫీస్‌కు తీసుకువెళ్లిపోయారని తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం సీడీపీవో కార్యాలయానికి రావాలని తెలిపితే వెళ్లానని, అక్కడ కూడా వారు తీవ్ర దుర్భాషలాడారని ఆమె పేర్కొన్నారు. 3న పోతనవలస గ్రామంలో సూపర్‌వైజర్ తనిఖీ చేశారని, అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పాలు, గుడ్లు, సరకులు సక్రమంగా ఇస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపినా.. సీడీపీవో మంగతాయారు గ్రామ సమావేశంలో అందరి ముందు తనని చెప్పలేని పదజాలంతో తీవ్రంగా దుర్భాషలాడారని నూకరత్నం తెలిపారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని నూకరత్నం తెలిపారు.
బాధితురాలికి సీపీఎం నాయకుల పరామర్శ
కె.కోటపాడు సీహెచ్‌సీలో నూకరత్నంను సీపీఎం నాయకులు పరామర్శించారు. పార్టీ మండల కార్యదర్శి రొంగలి ముత్యాలనాయుడు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్త నూకరత్నంకు ఎటువంటి ప్రమాదం జరిగినా సీడీపీవో, సూపర్‌వైజర్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఉద్యోగపరంగా తప్పులుంటే సంజాయిషీ అడగాలి లేదా శాఖాపరంగా పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప వ్యక్తిగతంగా దూషించే హక్కు ఎంత పెద్ద అధికారికీ లేదని ముత్యాలనాయుడు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment