మహిళల రక్షణ కోసం శక్తి టీమ్
● అందరూ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి ● హోం మంత్రి అనిత
నక్కపల్లి: మహిళల రక్షణ కోసం శక్తి టీమ్‌లను ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేక యాప్‌ను రూపొందించామని రాష్ట్ర హోం, విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. సోమవారం నక్కపల్లిలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ పాఠశాల విద్యార్థులు, మహిళా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం నక్కపల్లి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శక్తి యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ప్రతి మహిళ ఈ యాప్‌ను తమ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం శక్తి టీమ్‌లను రంగంలోకి దించుతున్నామన్నారు. 112 నంబరుకు ఫోన్ చేస్తే 15 నుంచి 20 నిమిషాల్లో శక్తి టీం వస్తుందన్నారు. ఎన్టీపీసీ సాయంతో మాదక ద్రవ్యాలు, మహిళా చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే వాహనాలను మంత్రి ప్రారంభించారు. శక్తి టీమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా సమకూర్చిన 39 వాహనాలు, 11 డ్రోన్స్‌ను మంత్రి ప్రారంభించి పోలీస్ శాఖకు అందజేశారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ గడచిన ఆరు నెలల కాలంలో గంజాయి కేసుల్లో 500 మందిని అరెస్టు చేశామని, 47 కేసుల్లో శిక్షలు పడ్డాయన్నారు. 11 వేల ఎకరాల్లో సాగయ్యే గంజాయి పంటను 90 ఎకరాలకు పరిమితం చేశామన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం 39 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన 13 మంది పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, అదనపు ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌బీ డీఎస్పీ అప్పారావు, పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, ట్రెయినీ డీఎస్పీ కృష్ణచైతన్య, సీఐలు కుమారస్వామి, రామకృష్ణ, ఎస్‌ఐ సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment