● ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు సిద్ధం ● గ
చోడవరం:
గోవాడ చెరకు రైతులకు వైఎస్సార్‌సీపీ బాసటగా నిలిచింది. సుగర్ ఫ్యాక్టరీలో తరుచూ క్రషింగ్‌కు అంతరాయం కలగడంతో చెరకు రైతులు కొద్ది రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి అండగా నిలిచి, వారి సమస్యలను ప్రభుత్వానికి ఎలుగెత్తి చాటేందుకు మేమున్నామంటూ వైఎస్సార్‌సీపీ ముందుకు వచ్చింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్రతో కూడిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం సోమవారం గోవాడ సుగర్ ఫ్యాక్టరీని సందర్శించింది. ఇక్కడి యార్డులో నిలిచిపోయిన చెరకు బళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు, ప్రస్తుత ఫ్యాక్టరీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమకు గతేడాది చెరకు బకాయిలు ఇంకా ఇవ్వలేదని, ఈ ఏడాది 40 రోజులు ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించారని, ఫ్యాక్టరీ మిషనరీలో మరమ్మతుల వల్ల ఈ సీజన్‌లో అనేక సార్లు క్రషింగ్ ఆగిపోయిందని, ఈ ఏడాది సరఫరా చేసిన చెరకుకు ఇంకా పేమెంట్స్ ఇవ్వలేదని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఫ్యాక్టరీని బాగుచేస్తామని, రైతులకు రూ.4 వేలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే రాజు, బండారు ఇప్పుడు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నా ఇటువైపు కన్నెత్తి చూడలేదని మరికొంతమంది రైతులు ఆగ్రహంతో చెప్పారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పడు పలుసార్లు ఫ్యాక్టరీకి సాయం చేశారని, ఆ డబ్బులతో ఎప్పటికప్పుడు చెరకు బకాయిలు చెల్లించడంతోపాటు ఫ్యాక్టరీ ఓవరాయిలింగ్ పనులు కూడా పూర్తిగా చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోవడంతో రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించలేదని, ఫ్యాక్టరీని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ పూర్తిగా పట్టించుకోలేదని రైతులంతా ముక్తకంఠంతో చెప్పారు. వైఎస్సార్‌సీపీ రైతులకు అండగా ఉండేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లండంటూ రైతులు సమస్యలు విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment