ఉచితం పేరుతో అనుచితం
తుమ్మపాల: విద్య హక్కు చట్టం ద్వారా చదువుతున్న పేద విద్యార్థులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద పీజీఆర్‌ఎస్ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం కలెక్టర్ విజయ్ కృష్ణన్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం.రమణ మాట్లాడుతూ విద్యార్థులను ఫీజుల ఒత్తిడికి గురిచేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని, గతంలో రెండుసార్లు కలెక్టర్‌కు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలు లేవన్నారు. పట్టణంలో గుడ్‌షెపర్ఢ్, విద్యాధరి, శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని, ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లకు కూడా ఫీజులు చెల్లించాలని వత్తిడి చేయడం తీవ్ర అన్యాయమన్నారు. అధికారులు స్పందించి ఈ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, ఉచిత విద్య పథకంలో చదువుతున్న విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు తిరిగి వెనక్కు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment