దివ్యాంగ బాలలకు ఎన్టీపీసీ వితరణ
పరవాడ: స్థానిక దివ్యాంగ బాలల శ్రేయస్సుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అభినందించారు. దివ్యాంగ బాలల ఉపకరణాల వితరణకు ఎన్టీపీసీ రూ.12.99 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా దీపాంజిలినగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మాట్లాడారు. దివ్యాంగ బాలల విద్యాభివృద్ధి, అవసరమైన ఉపకరణాల పంపిణీకి ఎన్టీపీసీ సమకూర్చిన నిధులను సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. సమగ్ర శిక్ష పథక సంచాలకులు డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 43 భవిత కేంద్రాలకు గతంలో ఎన్టీపీసీ యాజమాన్యం రూ.12 లక్షలతో ఉపకరణాలు అందజేశారని, తాజాగా అనకాపల్లి జిల్లాలోని 24 భవిత కేంద్రాలు, ఆరు సహిత విద్యా రిసోర్స్ రూములు, ఉపకరణాలకు రూ.12.99 లక్షలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. సింహాద్రి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్‌శర్మ మాట్లాడుతూ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యం, బాలికా సాధికారిత, ఉపకార వేతనాలు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్టీపీసీ సమకూర్చిన ఉపకరణాలను మండలాల వారీగా ఆయా భవిత కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ అందించారు. దివ్యాంగ బాలలు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయ అధికారి బి.శకుంతల, రిసోర్స్ పర్సన్‌లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంస్థ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment