బైకులు, బంగారం దొంగ అరెస్టు
అనకాపల్లి : రామాపురం కాలనీ ఏలేరు కాలువ వద్ద సోమవారం పట్టణ ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తుండగా రావికమతం మండలం, కొత్తకోట గ్రామం, శివాలయం వీధికి చెందిన మొగలుతుర్తి మణికంఠ అలియాస్ రంగ పోలీసులను చూసి పారిపోబోయాడు. అనుమానంతో అతన్ని పట్టుకుని విచారించగా అతని వద్ద నుంచి చోరీ సొత్తు రెండు బైకులు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ఎం.శ్రావణి చెప్పారు. పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం విలేకరులతో వివరాలు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 15న అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ శివారు సుబ్బారావు దాబా దగ్గర హైవే పక్కన పార్క్ చేసి ఉన్న కారుల్లో అద్దాలను పగులకొట్టి అందులో రెండు హ్యాండ్ బాగుల్లో ఉన్న రూ.40వేలు నగదు, ఒక జత బంగారు చెంప స్వరాలు, ఒక జత బంగారు చెవి దిద్దులు, ఒక బంగారు మండ గొలుసు, ఒక బంగారు చైన్, ఒక యాపిల్ ఐఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు అందింది. పై వస్తువులను మొగలుతుర్తి మణికంఠ చోరీ చేసినట్టు అంగీకరించినట్టు డీఎస్పీ చెప్పారు. ఆ వ్యక్తి నుంచి రెండు బైక్‌లు, బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ టి.వి.విజయకుమార్, కానిస్టేబుల్స్ పి.కిషోర్‌కుమార్, టి.సంతోష్‌కుమార్, శివాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment