పేదల ఆర్థిక సాధికారతకు పీ–4 సర్వే
తుమ్మపాల : పేదరికం లేని సమాజం లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో (పి4) సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ గ్రామ, వార్డు సచివాయాల సిబ్బందిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పి4 సర్వేపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ, వార్డు సచివాలయల సిబ్బందికి వర్చువల్‌గా పీ4 సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, వారి జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో గల 20 శాతం మంది నిరుపేదలను గుర్తించడం ద్వారా పేదరికాన్ని దూరం చేయడం పీ4 సర్వే విధాన లక్ష్యమన్నారు. పి4 లక్ష్య సాధనకు ఈ నెల 8 నుంచి 18 తేదీ వరకు సర్వే చేయాలన్నారు. పేదల అవసరాలను గుర్తించి, వారి సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహదం చేస్తుందని కుటుంబాలు ప్రస్తుతం అందుకుంటున్న పథకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు.
సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఇంటి అవసరాలకు అనుగుణంగా సమర్ధమైన ప్రణాళికల రూపకల్పనకు వీలవుతుందన్నారు. ఈ సమాచారాన్ని కుటుంబాలకు వివరించి కుటుంబ వివరాలతో పాటు వివిధ సామాజిక, ఆర్థిక పరిమితులతో కచ్చితమైన సమాచారాన్ని యాప్‌లో పొందుపరచిన 27 ప్రశ్నల ద్వారా సేకరించాలని ఆదేశించారు. కుటుంబాలకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించి, సర్వేను పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో సమష్టి భాగస్వామ్యంతో సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర –2047‘ లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు, రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశంగా నిలిచిన ‘10 సూత్రాలు‘ ఫ్రేమ్‌వర్క్‌లో ‘జీరో పావర్టీ పీ4 పాలసీ‘ అత్యంత ప్రాముఖ్యత అంశం కనుక ఈ విధానం పై ప్రజల అభిప్రాయం క్యూఆర్ కోడ్, https://swarnandhra. ap.gov.in/p4 వెబ్ పోర్టల్ ద్వారా అత్యధిక సంఖ్యలో సేకరించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి నాగలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ నెల 8 నుంచి 18 వరకు కార్యక్రమం
27 ప్రశ్నలతో పీ4 సర్వే యాప్
కలెక్టర్ విజయకృష్ణన్
Comments
Please login to add a commentAdd a comment