పది, ఇంటర్‌లో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యం
● బీసీ, ఎస్సీ వెల్ఫేర్ డీడీ రాజేశ్వరి ● నర్సీపట్నంలో వసతి గృహాల సందర్శన
నర్సీపట్నం: ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను సమాయత్తం చేశామని బీసీ, ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కె.రాజేశ్వరి తెలిపారు. నర్సీపట్నంలోని బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ బాలికల వసతి గృహంలో హైస్కూల్, కాలేజీ విద్యార్థులకు వసతి సరిపోవడం లేదని వార్డెన్ రాజ్యలక్ష్మి డీడీ దృష్టికి తీసుకెళ్లారు. అదనపు భవనం మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానని డీడీ బదులిచ్చారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వసతిగృహాల్లో జరుగుతున్న మరమ్మతుల పనులను పరిశీలించి, సంక్షేమాధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీడీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో బీసీ వసతి గృహాల నుంచి 645 మంది, ఎస్సీ వసతి గృహాల నుంచి 344 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు బీసీ కాలేజీ వసతిగృహాల నుంచి 700 మంది, ఎస్సీ కాలేజీ వసతి గృహాల నుంచి 130 మంది హాజరవుతున్నట్టు చెప్పారు. విద్యార్థులకు అన్ని విధాలా తర్ఫీదు ఇచ్చామన్నారు. బీసీ వసతి గృహాల మరమ్మతులకు రూ.72 లక్షలు, ఎస్సీ వసతిగృహాల మరమ్మతులకు రూ.4.20 కోట్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వసతిగృహం వార్డెన్ అర్జున్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment