ప్రతి రోజు పండగ కావాలి
తుమ్మపాల: మహిళల జీవితంలో ప్రతి రోజు పండగ కావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆకాక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె మిగతా మహిళా అధికారులతో కలసి పాల్గొన్నారు. కేట్ కట్ చేసి, జిల్లా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ప్రతి మహిళ వారి కోరికలు, లక్ష్యాలను నెరవేర్చుకొనేలా కుటుంబ సభ్యులు సహాయపడాలని, చదువు, ఉద్యోగాలలో వారిని ప్రోత్సహించాలని కోరారు. నేడు అన్ని రంగాలలో మహిళలు ముందుంటున్నారని, రాజకీయ, విద్య, న్యాయ, వైద్య, రక్షణ, పరిపాలన, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నత పదవులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని, కళలు, ఆటలు, పారిశ్రామిక, వ్యవసాయం వంటి అనేక రంగాలలో ఉన్నతంగా రాణిస్తున్నారని అన్నారు. ప్రతి బాలికకు విద్యను అందించాలని, మహిళకు ఉన్నత స్థానాన్ని ఇవ్వాలని, వారి మాటకు గౌరవాన్నివ్వాలన్నారు. మహిళను గౌరవించిన సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. జేసీ ఎం.జాహ్నవి మాట్లాడుతూ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థానానికి చేరిన మహిళా అధికారులు జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మహిళల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని కుటుంబ బాధ్యతలతో పాటు, వృత్తిలో కూడా రాణిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయిషా, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సుబ్బలక్ష్మి, రమామణి, మనోరమ, కలెక్టరు కార్యాలయ పరిపాలనాధికారి బి.వి.రాణి, ఇతర మహిళా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయ కృష్ణన్ ఆకాంక్ష
మహిళలకు శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment