ఆయిల్‌ తాగేశారు! | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ తాగేశారు!

Published Mon, Mar 10 2025 11:01 AM | Last Updated on Mon, Mar 10 2025 10:56 AM

ఆయిల్‌ తాగేశారు!

ఆయిల్‌ తాగేశారు!

అధికారులే
నెలకు అదనంగా రూ.30 లక్షల ఆయిల్‌ వినియోగం అధికారులకు అధికారులే మామూళ్ల ఆఫర్‌
● ఫాగింగ్‌ యంత్రాల ఆయిల్‌ బిల్లు రూ.68 లక్షలకు పెంచేశారు.. ● ప్రతి నెలా పబ్లిక్‌ హెల్త్‌, మెకానికల్‌ అధికారులకు లంచాలు ● డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ అధికారికి పంపకాల బాధ్యత ● గత కమిషనర్‌ హయాంలో క్షేత్రస్థాయిలో పరిశీలన ● నెలకు అదనంగా రూ.30 లక్షలు కొట్టేస్తున్నారని స్పష్టం ● ఇప్పటికీ చర్యలు తీసుకోని వైనం

తనిఖీలో తేలిందిలా..

ఫాగింగ్‌ యంత్రాలకు ప్రతి నెలా సుమారు రూ.30 లక్షల మేర అదనపు ఆయిల్‌ వినియోగం జరుగుతుండటంతో, మెకానికల్‌ విభాగానికి కొత్తగా వచ్చిన అధికారికి అనుమానం కలిగింది. దీంతో ఆయన ఈ విషయాన్ని గత కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన ఆదేశాల మేరకు ఫాగింగ్‌ యంత్రాలకు గంటకు ఎంత ఆయిల్‌ అవసరమవుతుందో ముగ్గురు అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవానికి ఈ ఫాగింగ్‌ యంత్రాలకు గంటకు 40 నుంచి 45 లీటర్ల ఆయిల్‌ సరిపోతుందని విచారణలో తేలింది. అయితే గతంలో పనిచేసిన అధికారి మాత్రం ఏకంగా 120 లీటర్ల చొప్పున ఆయిల్‌ మంజూరు చేయడం గమనార్హం. ఫాగింగ్‌ పనులను పర్యవేక్షించే డిప్యూటేషన్‌ అధికారి, ప్రజారోగ్య విభాగంలోని ముఖ్య అధికారులు అడిగిన దాని ప్రకారమే గత అధికారి మంజూరు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఫాగింగ్‌ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత కలిగిన ఆ డిప్యూటేషన్‌ అధికారి మామూళ్ల వ్యవహారాలను కూడా చూస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆ అధికారి ప్రతి నెలా మెకానికల్‌, ప్రజారోగ్య శాఖ అధికారులకు క్రమం తప్పకుండా మామూళ్లు అందజేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కమిషనర్‌ ఫాగింగ్‌ వ్యవహారాల పర్యవేక్షణాధికారికి షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, ఆయన బదిలీ, ఎన్నికల నియామవళి అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న కలెక్టరు దృష్టికి ఈ విషయం వెళ్లకుండా కొందరు జాగ్రత్తగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

సాధారణంగా ఏదైనా పనిచేసే కాంట్రాక్టర్‌.. అధికారులకు లంచాలు ఇవ్వడం పరిపాటి. అయితే ఘనత వహించిన జీవీఎంసీలో మాత్రం అధికారులే అధికారులకు లంచాలు ఇస్తున్నారు. తమకు ఇంత మొత్తం బిల్లు ఆయిల్‌ కోసం ఇస్తే.. మీకు ఇంత మొత్తం ప్రతి నెలా లంచం ముట్టచెబుతామంటూ ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం. మెకానికల్‌ విభాగం, ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారుల మధ్య జరిగిన ఈ డీల్‌తో జీవీఎంసీకి భారీ నష్టం జరిగింది. గతంలో మెకానికల్‌ విభాగంలో పనిచేసిన ఓ అధికారితో పాటు జీవీఎంసీకి డిప్యూటేషన్‌పై వచ్చిన ఇద్దరు అధికారుల మధ్య లాలూచీతో వ్యవహారం సాఫీగా సాగింది. వాస్తవానికి ఫాగింగ్‌ యంత్రాల కోసం గతంలో రూ.38 లక్షల మేర నెలవారీగా బిల్లు ఉండగా.. దానిని ఏకంగా రూ.68 లక్షలకు పెంచేశారు. దీనిపై గత నెలలో అప్పటి కమిషనర్‌ ఆధ్వర్యంలో విచారణ చేయగా.. రూ.38 లక్షల మేర ఆయిల్‌ బిల్లు సరిపోతుందని తేలింది. తద్వారా నెలకు రూ.30 లక్షల మేర అధికంగా ఆయిల్‌ పేరుతో లాగేసినట్టు విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలో సదరు మెకానికల్‌ అధికారిపై ఈ వ్యవహారంతో పాటు ఇతర ఫిర్యాదులు రాగా బదిలీ వేటు పడింది. అయితే డిప్యూటేషన్‌పై ఉన్న మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈలోగా కమిషనర్‌ బదిలీతో ఈ వ్యవహారం మూలకు చేరింది. ఈ వ్యవహారంలో అడిగినంత మేర ఆయిల్‌ ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఇద్దరు అధికారులకు మరో అధికారి ప్రతి నెలా రూ.2 లక్షల చొప్పున మామూళ్లు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న కలెక్టర్‌ ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

అడ్డగోలుగా ఆయిల్‌ సరఫరా

జీవీఎంసీలో ఫాగింగ్‌ మిషన్లు పెద్దవి 8, మీడియం సైజువి 80 ఉండగా, స్ప్రింక్లర్లు 25 ఉన్నాయి. వీటికి ప్రతి నెలా గతంలో రూ.38 లక్షల మేర ఆయిల్‌ బిల్లు చెల్లించేవారు. అయితే డిప్యూటేషన్‌పై వచ్చిన ఇద్దరు అధికారులు, మెకానికల్‌ విభాగంతో కుదుర్చుకున్న మామూళ్ల ఒప్పందంలో భాగంగా ఈ బిల్లును ఏకంగా రూ.68 లక్షలకు పెంచేశారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ ఇద్దరు అధికారులకు ప్రతి నెలా రూ.2 లక్షల చొప్పున ముట్టజెప్పే విధంగా ఒప్పందం కుదిరినట్టు సమాచారం. మలేరియా విభాగం వారు అడిగిన మేరకే తాము ఆయిల్‌ కార్డులను ఇచ్చామని మెకానికల్‌ విభాగంలో పనిచేసిన అధికారి చెబుతున్నట్టు సమాచారం. గతానికి భిన్నంగా ఒకేసారి రెట్టింపు స్థాయిలో ఆయిల్‌ వినియోగం పెరిగితే కనీసం విచారణ చేయాల్సిన మెకానికల్‌ విభాగం అధికారి, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఆయిల్‌ను తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. సదరు అధికారులకు అధికార పార్టీ నేతల నుంచి మద్దతు కూడా ఉండటంతో ఎవరూ తమను ఏమీ చేయలేరనే ధీమాతో అడ్డగోలుగా ఆయిల్‌ పంపిణీకి తెరలేపారు. ఈ వ్యవహారంలో కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లకు కూడా నెలవారీగా మామూళ్లు అందినట్టు తెలుస్తోంది. రాబోయే కాలానికి కాబోయే మేయర్‌నని చెప్పుకుంటున్న నేత వద్ద ఉండే ఇద్దరు కార్పొరేటర్లకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement