అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్‌

Published Tue, Mar 11 2025 12:51 AM | Last Updated on Tue, Mar 11 2025 12:49 AM

అర్జీ

అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్‌

తుమ్మపాల : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కలెక్టరేట్‌లో నెల రోజుల పాటు నిలిపివేసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం సోమవారం పునఃప్రారంభమైంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్‌ పరిసరాలు నిండిపోయాయి. అర్జీల వివరాలు ఆన్‌లైన్‌ చేసేందుకు పది శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్‌ వద్ద సచివాలయ ఉద్యోగులు నిరక్ష్యరాసులు, వృద్ధులు, వికలాంగుల సమస్యలు తెలుసుకుని అర్జీలు తయారు చేశారు. సమస్యల ఆధారంగా అర్జీలపై నమోదు చేసిన రిఫరెన్స్‌తో ఆన్‌లైన్‌ చేసి మొదటి అంతస్తు పీజీఆర్‌ఎస్‌ వేదికపైకి పంపించడంతో కలెక్టర్‌, డీఆర్‌వో, ఇతర జిల్లా అధికారులు అర్జీదారుల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెండింగ్‌ అర్జీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అర్జీలకు పరిష్కారం చూపడమే కాకుండా, పరిష్కారం కాని దరఖాస్తులకు వివరంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. సోమవారం మొత్తం 440 అర్జీలు నమోదవ్వగా అందులో అత్యధికం భూ సమస్యలపైనే కావడం గమనార్హం.

దివ్యాంగులు, వృద్ధులు ఆరు బయటే...

భౌతికంగా తమను చూసి జాలితోనైనా సమస్య పరిష్కారానికి కలెక్టర్‌ కృషి చేస్తారనే గంపెడు ఆశతో జిల్లా సరిహద్దుల నుంచి సైతం వృద్ధులు, వికలాంగులు కలెక్టరేట్‌కు చేరుకుంటే వారిని సిబ్బంది ఆరుబయటే నిలిపివేశారు. దీంతో నేరుగా కలెక్టర్‌ను కలిసి తమ గోడు చెప్పుకునే అవకాశం లేక వెనుతిరుగుతున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వీల్‌ చైర్లు, లిఫ్ట్‌ ద్వారా తామే స్వయంగా కలెక్టర్‌ను కలవగలమని, కానీ అందుకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన చెందారు. భూ సమస్యపై పాయకరావుపేట మండల నుంచి కుటుంబసభ్యుల సహాయంతో వచ్చిన 95 ఏళ్ల వృద్ధురాలికి కలెక్టర్‌ను కలిసే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె అర్జీని ఇతరులతో పీజీఆర్‌ఎస్‌లో నమోదు చేయించి జిల్లా అఽధికారులకు పంపించారు.

వివాదంలో ఉన్న భూమి ఆన్‌లైన్‌పై ఫిర్యాదు

కోర్టు వివాదంలో ఉన్న భూమిని ఆన్‌లైన్‌న్‌ చేసి, భూ ఆక్రమణకు ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాయకరావుపేట మండలం పడాలవాని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పదిలం సీతయ్యమ్మ (95 ఏళ్ల వృద్ధురాలు)తో ఆమె కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సర్వే నెం.155, 158, 153, 164, 162లో పలు సబ్‌ డివిజన్‌లలో తన భర్త వాటాకు గల వ్యవసాయ భూములు తన పేరున పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లడంతో ప్రసుత్తం సదరు అంశం కోర్టు పరిధిలో ఉంది. భూమిని ఇరువురికి కూడా ఆన్‌లైన్‌ చేయవద్దంటూ డిస్ప్యూట్‌ రిజిస్టర్‌లో కూడా నమోదు చేయడం జరిగిందని, కానీ రీ సర్వేలో వీఆర్వోతో పాటు సర్వేయర్‌, రెవెన్యూ అధికారులు సదరు భూములను తన కుటుంబ సభ్యుల పేరి ఆన్‌లైన్‌ చేయడంతో వారు భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని వృద్ధురాలు తెలిపారు. కలెక్టర్‌, జిల్లా అధికారులు తక్షణమే విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. అయితే కలెక్టర్‌ను స్వయంగా కలిసి తన బాధ చెప్పుకునే అవకాశం లేకపోవడంపై ఆమె నిరాశ వ్యక్తం చేసింది.

ఇంటి పట్టా కోసం మూడేళ్లుగా ఎదురు చూపులు

ప్రభుత్వ భూమిలో ఉన్న ఇంటికి క్రమబద్దీకరణ పత్రం అందిస్తామని చెప్పి జీవో నెం.225 ద్వారా రూ.2.17 లక్షలు కట్టించుకుని నేటికీ పట్టా ఇవ్వడం లేదని అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కోరుకొండ పెదసాధు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. పైకప్పు రేకులుగా ఉన్న ఇంటికి శాశ్వత హక్కు పత్రం వస్తుందనే ఆశతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, కూలి పనులు చేసుకునరి దాచుకున్న సొమ్మంతా సచివాలయంలో కడితే బిల్లు ఇచ్చి సరిపెట్టేసారని, కలెక్టరమ్మ చొరవ చూపి తనకు న్యాయం చేయాలని కోరారు.

బ్యాటరీ ట్రైసైకిల్‌ మంజూరు చేయరూ...

వికలాంగుడినైన తన జీవనోపాధి కోసం బ్యాటరీ ట్రై సైకిల్‌ మంజూరు చేయాలని చీడికాడ మండలం తిరువోలు గ్రామానికి చెందిన కంచి రాము అర్జీ చేసుకున్నాడు. నిరుపేద అయిన తాను 40 ఏళ్ల నుంచి గ్రామంలో చిన్న కిల్లీబడ్డి పెట్టుకుని జీవిస్తున్నానని, ఈ నెల 9న విద్యుత్‌ షార్ట్‌ సర్క్యుట్‌తో కిల్లీబడ్డితో పాటు తన బండి కూడా కాలిపోయిందని, సరుకులు తెచ్చుకుని అమ్ముకుని జీవనోపాధి పొందెందుకు బ్యాటరీ బండి మంజూరు చేయాలని కోరారు.

పూర్వ తహసీల్దార్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

యలమంచిలి రూరల్‌ : యలమంచిలి పూర్వ తహసీల్దార్‌ ఎస్‌.రాణి అమ్మాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేగుపాలెం మాజీ సర్పంచ్‌ కొల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, అనకాపల్లి ఆర్డీవో ఆయీషాలకు సోమవారం ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామ పరిధి సర్వే నంబర్లు 167/1,167/3లో 2.91 ఎకరాల ప్రభుత్వ భూమిని యలమంచిలి పూర్వపు తహసీల్దార్‌ రాణి అమ్మాజీ ఉద్దేశపూర్వకంగా ఒక రియల్టర్‌ పేర జిరాయితీగా రికార్డులను మార్పు చేసి ఆ భూమి అమ్మకం జరిగేలా చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటీవల ఆ భూమిని కొనుగోలు చేసిన ఒక సిమెంటు పరిశ్రమ యాజమాన్యం పక్కనే ఉన్న ఎర్రచెరువుతో పాటు పక్కనే ఉన్న శ్మశానవాటిక స్థలాన్ని కూడా ఆక్రమించి గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా భారీ ప్రహరీ గోడ నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదులో తెలిపారు. తప్పు జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా ఈ అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్థంకావడం లేదని మాజీ సర్పంచ్‌ సందేహం వ్యక్తపరిచారు. దీనికి సంబంధించి ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తల క్లిప్పింగులను కూడా ఫిర్యాదుదారు తన ఫిర్యాదుతో జతపరిచారు.

నెల తరువాత మొదలైన పీజీఆర్‌ఎస్‌

అర్జీలు భూ సమస్యలపైనే అధికం

ఆరు బయటే దివ్యాంగులు, వృద్ధులు

No comments yet. Be the first to comment!
Add a comment
అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్‌ 1
1/4

అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్‌

అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్‌ 2
2/4

అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్‌

అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్‌ 3
3/4

అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్‌

అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్‌ 4
4/4

అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement