నీ వెంటే.. నేనూ !
● భర్తకు పెద్దకర్మ చేస్తూ భార్య మృతి ● రామానాయుడుపాలెంలో విషాదం
యలమంచిలి రూరల్: నీలో నేను సగమంటూ భార్యాభర్తలు భావిస్తుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత ఎక్కువైనప్పుడు, ఇద్దరిలో ఏ ఒక్కరు దూరమైనా, మిగిలిన వారు తీవ్ర వేదనకు గురవుతారు. నీవులేని బతుకు నాకెందుకంటూ కుమిలిపోతుంటారు. చనిపోయిన భర్తకు పెద్దకర్మ నిర్వహిస్తుండగానే, అతని భార్య నీ వెంటే నేనంటూ తుది శ్వాస విడిచింది. మున్సిపాలిటీ పరిధి రామానాయుడుపాలెంలో తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటన వివరాలు.. ఈ నెల 1న రామానాయుడుపాలెం గ్రామానికి చెందిన రావి తాతారావునాయుడు (60) అనారోగ్యంతో చనిపోయారు. సోమవారం కుటుంబసభ్యులు, బంధువులు పెద్దకర్మ నిర్వహిస్తుండగా ఊహించని షాక్ తగిలింది. తాతారావునాయుడు చిత్రపటానికి భార్య నాగమణి (50) పుష్పాలు వేసి పూజ చేసి నివాళులర్పిస్తూ, అందరూ చూస్తుండగానే గుండెపోటుతో కుర్చీలో కూలబడిపోయింది. బంధువులు, కుటుంబ సభ్యులు కంగారుగా వెళ్లి చూసేసరికి నాగమణి ప్రాణాలు విడిచింది. వివాహమైనప్పటి నుంచి ఈ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండేవారని బంధువులు స్థానికులు చెప్పారు. సోమవారం సాయంత్రమే ఆమెకు పెద్ద కుమార్తె లీలావతి అంత్యక్రియలు నిర్వహించారు.
నీ వెంటే.. నేనూ !
నీ వెంటే.. నేనూ !
Comments
Please login to add a commentAdd a comment