కూటమి పాలనలో సహకార రంగం నిర్వీర్యం
సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు
అనకాపల్లి టౌన్: సహకార రంగాన్ని నిర్వీర్యం చేయడమే రాష్ట్ర ప్రభుత్యం ధ్యేయంగా కనిపిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. మూడు నెలలుగా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిలు, రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిలు సుమారు రూ.35 కోట్లు ఉందన్నారు. ఎన్నికలకు ముందు పార్లమెంట్ సభ్యుడు సి.ఎం రమేష్ రూ.100 కోట్లు నిధులను తీసుకొచ్చి జిల్లాలో సుగర్ ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో 14 సహకార చక్కెర కర్మాగారాలు ఉండేవని, వాటిలో చాలా వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు అమ్మేసారని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు లోకనాథం మాట్లాడుతూ బడ్జెట్‌లో సహకార రంగానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో చెరకు విస్తీర్ణత శాతం తగ్గిపోయిందని, దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మెగ్గు చూపుతున్నారన్నారు. ముందుగా సామాజిక విప్లవ నాయకురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి వివాళులు అర్పించారు. ఈ సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరావు, మండల కార్యదర్శి గంటా శ్రీరామ్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment