నక్కపల్లి: జో అచ్చుతానంద, జోజో ముకుందా అంటూ ఉపమాకలో స్వామివారి పవళింపు సేవలు (పుష్పయాగోత్సవాలు) ఘనంగా జరుగుతున్నాయి. కల్యాణోత్సవాల అనంతరం స్వామివారికి మూడు రోజుల పాటు పవళింపు సేవలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు, ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారికి క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామికి నిత్యపూజలు, ఆరాధనలు నిర్వహించారు. రాత్రి నిత్య సేవాకాలం, విశేష ప్రసాద నివేదనలు తీర్థగోష్టి , భక్తులందరికీ ప్రసాద వినియోగం నిర్వహించారు. తదుపరి స్వామివారి పుష్పయాగోత్సవం రెండోరోజు కార్యక్రమంలో భాగంగా అద్దాల మండపం వద్దకు తీసుకెళ్లి ఉత్సవమూర్తులను ఉయ్యాలలో ఉంచి ప్రత్యేక పూజలు, షోడోపచార పూజలు నిర్వహించారు. పండ్లు, పాలు నివేదన చేసి భక్తుల సమక్షంలో నీరాజనాలు సమర్పించారు. శ్రీవైష్ణవ దంపతులకు తాంబూలాలు అందజేసి నీరాట్టం సేవాకాలంతో స్వామివారికి పుష్పయాగోత్సవం పవళింపు సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. పుష్పయాగోత్సవాల్లో ప్రధానార్చకులు వరప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రాజగోపాలాచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి స్వామివారిని దర్సించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. సుగంధ ద్రవ్యాల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు.